ఇదేం ‘తీరు.. వా..!’


పిఠాపురం : రైతుల నుంచి వసూలు చేసే నీటితీరువాలో పంచాయతీలకు కేటాయించాల్సిన వాటాను జమ చేసే తీరు అవినీతిమయంగా మారింది. సొమ్ములు చేతులు మారందే పంచాయతీలకు  నిధులు రావడంలేదు. పలుకుబడి, రాజకీయ అండదండలు ఉన్న కొందరు తమ పంచాయతీల ఖాతాల్లోకి నీటితీరువా వాటాను జమ చేయించుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2006 నుంచి సుమారు రూ.6.50 కోట్ల నీటితీరువా వాటా పంచాయతీలకు జమ కావాల్సి ఉన్నట్టు అంచనా. ఏటా రైతుల నుంచి సార్వాకు రూ.200, దాళ్వాకు రూ.150 నీటితీరువా వసూలు చేస్తూంటారు. ఇందులో 10 శాతం నీటిసంఘాలకు, ఐదు శాతం పంచాయతీల అభివృద్ధికి కేటాయించాలి. రెవెన్యూ అధికారులు నీటితీరువా వసూలు చేసి, ట్రెజరీల్లో జమ చేస్తారు.

 

 అనంతరం ఆ ఏడాది  పంచాయతీల కు చెల్లించాల్సిన మొత్తం వివరాలను ఆరు నెలలకోసారి బ్యాంకులు, ట్రెజరీలకు అందజేయలి. వాటి ఆధారంగా ఆ నిధుల్ని ట్రెజరీ అధికారులు ఆయా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తారు. కానీ ప్రస్తుతం ఈ విధానం అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. నీటిసంఘాలకు సక్రమంగానే నిధులు అందుతున్నా..  ఏళ్ల తరబడి పంచాయతీలకు అందడం లేదు. ఐదు శాతం నీటితీరువా నిధులతో పంచాయతీ అభివృద్ధి పనులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఇప్పటివరకూ కొన్ని ప్రాంతాల్లో ఎనిమిదేళ్లుగా, కొన్నిచోట్ల మూడేళ్లుగా నీటితీరువా వాటా పంచాయతీలకు జమ కావడంలేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని సర్పంచులు వాపోతున్నారు. జిల్లాలో 1012 గ్రామ పంచాయతీలుండగా వీటిలో 224 మేజర్, 788 మైనర్ ఉన్నాయి.

 

 పంచాయతీల పరిధి లో ఉన్న భూములనుబట్టి ఒక్కో పంచాయతీకి ఏటా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ నీటితీరువా వాటా వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మైనర్ పంచాయతీకి సుమారు రూ.4 లక్షలు, మేజర్ పంచాయితీకి రూ.12 లక్షల వరకూ బకాయిలున్నాయి. వీటికోసం కొందరు సర్పంచ్‌లు రెవె న్యూ, ట్రెజరీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని అధికారులు క్రమపద్ధతిలో జమ చేయాల్సి ఉన్నా సర్పంచ్‌ల నుంచి మామూళ్లు ఆశించి, జాప్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని మండలాల్లో సర్పంచ్‌లంతా కొంత సొమ్ము వసూలు చేసి, వాటిని అధికారులకు ముట్టజెప్పడం ద్వారా నీటితీరువా వాటా సాధిస్తున్నట్టు సమాచారం. కొంతమంది సర్పంచ్‌లకు అసలు నీటితీరువా అంటేనే తెలియని దుస్థితి కనిపిస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top