పైసలు కొట్టు.. పరీక్షా కేంద్రం పట్టు

పైసలు కొట్టు..   పరీక్షా కేంద్రం పట్టు


ఐటీఐ పరీక్షా కేంద్రాల ఎంపికలో‘ప్రైవేట్’కే ప్రాధాన్యం

వారు చెప్పిన చోటుకే పరీక్షా కేంద్రం

ప్రభుత్వ ఐటీఐల్లోనూ మారని తీరు


 బొబ్బిలి: ‘సార్... మాకిక్కడ సెంటరు ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి.. మేం మరో దగ్గరకు మాట్లాడుకుంటున్నాం... అక్కడకు మాకు అవకాశం కల్పించండి..’ ఇదీ పరీక్షా కేంద్రాల మార్పు కోసం ప్రైవేట్ ఐటీఐ కేంద్రాల డిమాండ్. ప్రైవేటు ఐటీఐల్లో థియరీ పరీక్షలో శతశాతం ఉత్తీర్ణత కోసం ఆయా యాజమాన్యాల సూచ నలకు సాంకేతిక విద్యాశాఖాధికారులు తలొంచక తప్పడం లేదు. ఈ ఏడాది కేంద్రాలను మార్పు చేసుకోవడంలో ఉన్నతాధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఐటీఐ పరీక్షలు ఏడాదికి ఒకేసారి జరిగేవి.



అయితే గత మూడేళ్ల నుంచి సెమిస్టరీ విధానం పెట్టిన తరువాత మూడు మాసాలకోసారి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ విధానం ఇటు ఐటీఐలు నడుపుతున్న వారికి కాసుల పంటగానే ఉంది. గతంలో ఏడాదికి ఒకసారి వసూళ్లకు పాల్పడితే.. ఇప్పుడు నాలుగుసార్లు డబ్బులు కట్టే పరిస్థితి ఉంది.



ఈ నెల 10వ తేదీ నుంచి థియరీ పరీక్షలు మొదలవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు ప్రభుత్వ ఐటీఐలు, 22 ప్రైవేటు ఐటీఐల నుంచి దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో ప్రైవేటు ఐటీఐలకు చెందిన విద్యార్థులు సుమారు 4,500 నుంచి 4,800 మంది వరకూ ఉన్నారు. 22 ఐటీఐలకు చెందిన విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా అయిదు కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతున్నాయంటే.. ఆ శాఖ అధికారులు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేసి ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోంది. ఎస్.కోటలో 2, కొత్తవలసలో 2, విజయనగరంలో 5, బొబ్బిలిలో 3, పార్వతీపురంలో 3, జామి, గరివిడి, గజపతినగరం, రామభద్రపురం, నర్సిపురం, బలిజిపేటల్లో ఒక్కొక్కటి చొప్పున కేంద్రాలున్నాయి.





వీరందరికీ ప్రస్తుతం గరివిడి, విజయనగరం, గజపతినగరం(బాలాజీ), పార్వతీపురం(జ్యోతి), ఎస్.కోట హైస్కూల్‌ల్లో పరీక్షా కేంద్రాలను కే టాయించారు. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, సాలూరు, భద్రగిరిల్లో ప్రభుత్వ ఐటీఐలున్నాయి. వీటి పరిధిలో ఉండే

 ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ ఐటీఐల్లోనే పరీక్షలు జరిగేవి. అయితే ఇప్పుడు ఆ నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చేశారు. శతశాతం ఉత్తీర్ణత ఎక్కడ సాధ్యపడుతుందో అక్కడకే కేంద్రాలను మార్పు చేసుకోవడానికి ఉన్నత స్థాయిలో పైరవీలు చేసుకొని సఫలీకృతులయ్యారు. దాంతో అయిదు పరీక్షా కేంద్రాల్లో 22 ఐటీఐల విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశాన్ని కొట్టేశారు. పరీక్షా కేంద్రాలను దక్కించుకోవడంతోపాటు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు వేల రూపాయల్లో విద్యార్థుల నుంచి డబ్బుల వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.  పేద విద్యార్థులు యాజమాన్యాలు అడిగే వేలాది రూపాయలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top