అంత ఆత్రుత ఏల?


 సాక్షి, రాజమండ్రి : స్థానిక పాలనాస్ఫూర్తిని రాజమండ్రిలో అధికార తెలుగుదేశం అపహాస్యం చేస్తోంది. నాలుగురోజుల క్రితమే ఖరారు చేసిన ప్రకారం నేడు (30న) రాజమండ్రి నగర పాలక మండలి (కౌన్సిల్) సమావేశం జరగనుండగా అంతకు మూడురోజులు ముందే అంటే 27న.. రూ.1.91 కోట్ల విలువైన పనులను స్థాయీ సంఘం సమావేశంలో ఆమోదింపజేశారు. నగర పాలకసంస్థలో అభివృద్ధి కార్యక్రమాలేవైనా.. పాలక మండలి తీర్మానాలతోనే జరగాలి. పాలక మండలి సమావేశం కాలేని సందర్భాల్లో స్థాయీ సంఘాన్ని సమావేశపరిచి పరిమితికి లోబడి పనులను ఆమోదిస్తారు. కానీ మూడు రోజుల్లో పాలక మండలి సమావేశం జరగనున్నా.. నగరపాలక సంస్థ కార్యకలాపాల్లోకి చొరబడుతున్న టీడీపీ సీనియర్ నేత కనుసన్నల్లో చట్టంలోని వెసులుబాటును ఆసరాగా చేసుకుని చర్చ లేకుండానే పనులను ఆమోదింపజేసుకున్నారు.  

 

 నిబంధనల ప్రకారం రూ.పది లక్షల లోపు పనుల్ని కమిషనర్ ఆమోదించవచ్చు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ స్థాయీ సంఘం సమావేశంలో ఆమోదించవచ్చు. రూ.50 లక్షలకు మించిన పనులను విధిగా కౌన్సిల్‌లో చర్చించి ఆమోదించాలి. కానీ ఒకటో డివిజన్ తారకరామనగర్‌లో ఎస్‌డీబీసీ పేరుతో తారురోడ్డు వేసేందుకు అంచనా వ్యయం రూ.57 లక్షలు కాగా ఆ పనినే రూ.19 లక్షలు, రూ.19.20 లక్షలు, రూ.19.60 లక్షలు వ్యయమయ్యే మూడు పనులుగా చూపి, మూడు ఆర్‌ఓసీ నంబర్లతో ఆమోదం తెలిపింది స్థాయీ సంఘం. సమావేశంతో మొత్తం రూ.1.91 కోట్లు వ్యయం కాగల తొమ్మిది పనులకు ఆమోదం తెలిపింది స్థాయీ సంఘం. తాము చేయాలనుకున్న పనుల్ని కౌన్సిల్‌లో చర్చకు పెడితే కొన్ని ఆమోదం పొందకపోవచ్చని, తద్వారా ఆశించినది దక్కకపోవచ్చని అన్న అనుమానంతోనే టీడీపీ నేతలు ఈ అడ్డదారిని అనుసరించారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

 

 అజెండాలో అప్రధానమైన అంశాలు..

 ఈ ఏడాది జూలై మూడున కొలువుదీరిన కౌన్సిల్ గురువారం రెండోసారి సమావేశమవుతోంది.ఈ సర్వసభ్య సమావేశపు అజెండా కేవలం పేలవమైన అంశాలకే పరిమితమైంది. మొదటి మూడు అంశాలు ఉపాధ్యాయుల బదిలీ, ఖాళీల భర్తీకి చెందినవి. ఇంకా విద్యార్థుల యూనిఫారాలకు అ దనపు నిధులకు అనుమతి,  నగరపాలక సంస్థ కా ర్యాలయ సుందరీకరణ ప్లాన్‌కు కన్సల్టెన్సీ నియామకం, ఎస్‌టీపీ ప్లాంటుకు సమీపంలో కబేళా నిర్మాణం వంటి అంశాలు జెండాలో ఉన్నాయి.  

 

 అవకతవకల ‘కొనసాగింపు’నకు ఆమోదం?

 నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాల్లో   200 మంది, మరో 899 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరూ టెండర్ల ద్వారా కాంట్రాక్టు సంస్థల నుంచి నియమితులైన వారే. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ నియామకాల్లో అవకతవకలు జరి గాయన్న ఆరోపణలతో పని చేస్తున్న వారికి సెప్టెం బర్ వరకూ జీతాలు ఇచ్చి తర్వాత కొత్తగా టెండ ర్లు పిలవాలని గత సమావేశంలో తీర్మానించారు. అయితే టెండర్లు పిలిచినా ఎవరూ రానందున పాత వారినే కొనసాగించి, 2015 మార్చి వరకూ జీతాలు చెల్లించాలనే తీర్మానం కూడా కౌన్సిల్ ముందుకు రానుంది. దీని వెనుక మతలబేమిటో అధికారులకు, అధికార పార్టీ వారికే తెలియాలి.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top