టెంఢర్!

టెంఢర్!


తానొకటి తలిస్తే.. ఇంకేదో అయ్యిందన్నుట్లు తయారైంది ఆ కాంట్రాక్టర్ పరిస్థితి. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేయాలనుకుంటే.. సొంత జేబుకే చిల్లుపడే ప్రమాదం ఏర్పడటంతో బిక్కుమొహం వేశారు. సీన్ రివర్స్ కావడంతో తోక ముడిచారు. తక్కువ రేట్లు కోట్ చేసి పెద్ద మొత్తంలో పనులు దక్కించుకున్నారు. పనులు పర్యవేక్షించే వారంతా తమవారే కావడంతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు సాగించి.. పెద మొత్తంలో వెనకేసుకోవచ్చని ఆశపడ్డారు. కానీ ఎన్నికల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయి. అసలుకే మోసం వచ్చేలా ఉండటంతో పత్తా లేకుండాపోయారు.

 

 రాజాం: రాజాం నగర పంచాయతీ పరిధిలో చేపట్టిన రూ. 1.31 కోట్లతో వివిధ పనుల్లో సింహభాగం చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయారు. దీంతో అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈయన పనులు చేపట్టకపోవడం వెనక పెద్ద కథే ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి నెలలో ఈ పనులు చేపట్టేందుకు ఈ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఆన్‌లైన్ టెండర్లు ఆహ్వానిం చారు. వీటిలో పది పనులను స్థానిక కాం ట్రాక్టర్ ఒకరు రూ.20 లక్షలకు దక్కించుకున్నారు. మిగిలిన రూ.1.21 కోట్ల విలువైన 31 పనులను విశాఖపట్నానికి చెందిన మరో కాంట్రాక్టర్ తక్కువ రేట్ కోట్ చేసి చేజిక్కించుకున్నారు. స్థానిక కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి వాటిలో నాలుగింటిని ఇప్పటికే పూర్తి చేశారు.

 

 మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. అయితే ఎక్కువ పనులు చేజిక్కించుకున్న విశాఖ కాంట్రాక్టర్ మాత్రం పనులు చేపట్టడం కాదు కదా.. కనీసం ఇప్పటివరకు ఒప్పందం కూడా కుదుర్చుకోనేలేదు. 25 శాతం తక్కువకు టెండరు పాడిన ఆయన నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో నగరపంచాయతీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి రావాలని కోరుతూ నగరపంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. అయినా అటు నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 16న తుది నోటీసు జారీచేశారు. 4 రోజుల్లోగా వచ్చి అగ్రిమెంట్లు రాయిం చుకోవాలని అందులో స్పష్టంగా సూచించారు. దీనికి కూడా కాంట్రాక్టర్ నుంచి స్పందన లేకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టితీసుకెళ్లి టెం డర్ రద్దు చేసే విషయం పరిశీలిస్తామని మున్సిపల్ కమిషనర్ వి.అచ్చెన్నాయుడు చెప్పారు.

 

 ఎందుకు తోకముడిచారంటే..

 కాంట్రాక్టర్ వెనుకంజ వేయడం వెనుక పెద్ద తతంగమే నడిచింది. గతంలో ఇక్కడ ఏఈగా పనిచేసి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు బది లీపై వెళ్లి ఏఈ సూత్రధారిగా ఇది నడించింది. రాజాం నగర పంచాయతీలో పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నారని తెలుసుకున్న సదరు ఏఈ.. ఇక్కడంతా తనకు తెలిసిన అధికారులే ఉన్నందున తన వారితో టెండర్లు వేయించి పనులు దక్కించుకుంటే పెద్ద మొత్తంలో లాభపడవచ్చని భావించారు. తనకు అనుకూలమైన కాంట్రాక్టర్‌ను రంగంలోకి దించారు. తక్కువ రేటు కోట్ చేసిన వారికే పనులు కేటాయిస్తారన్న విషయం తెలుసు కనుక.. వ్యూహాత్మకంగా 25 శాతం తక్కువ రేటు కోట్ చేయించి.. టెండర్ ఖరారు చేయించుకోవడంలో విజయం సాధించారు. ఆ తర్వాత పనులు ఎలా చేసినా అడిగేవారుండరు.

 

 తక్కువ రేటే కోట్ చేసినా లాభాలకు ఢోకా ఉండదన్నది ఆయనగారి ఉద్దే శం. అయితే ఫిబ్రవరి నెలలో టెండర్లు పిలిచినా ఆ తర్వాత అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదు. ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం రావడం.. అదే సమయంలో సిమెంటు, ఇసుక తదితర నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగిపోయాయి. అసలే తక్కువ రేటు కోట్ చేశారు. ఇప్పుడు నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. ఇప్పుడు పనులు చేపడితే లాభం గూబల్లోకి వస్తుందని కాంట్రాక్టర్‌కు భయం పట్టుకుంది. దాంతో అగ్రిమెంటు కు సైతం ముందుకు రావడం లేదని తెలిసింది. ఇదే విషయమై నగర పంచాయతీ కమిషనర్ వి.అచ్చెన్నాయుడు వద్ద ప్రస్తావించగా కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం వాస్తవమేనన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top