శరణం ‘కన్సల్టెన్సీ’

శరణం ‘కన్సల్టెన్సీ’ - Sakshi


సాక్షి, హైదరాబాద్: తనకు ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా గట్టెక్కడానికి ప్రభుత్వం వద్ద ఉన్న మంత్రం.. ‘కన్సల్టెన్సీ’.కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కన్సల్టెంట్లకు సమర్పిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను రక్షించడానికీ అదే మార్గాన్ని అనుసరించింది. నత్తతో పోటీ పడుతూ సాగుతున్న పోలవరం పనుల ప్రగతి పట్ల ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాయడంతో పాటు సోమవారం సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదేవిధంగా పనులు జరిగితే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో కూడా చెప్పలేమని పేర్కొంది.


షెడ్యూలు ప్రకారం పనులు చేయకుంటే కాంట్రాక్టును రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికీ వెనకాడబోమని పీపీఏ సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ను రక్షించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. అథారిటీ హెచ్చరికను నేరుగా కాంట్రాక్టర్‌కు తెలియచేసి పనులు చేయకుంటే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించాలన్న అధికారుల ప్రతిపాదనను ప్రభుత్వ పెద్దలు తిరస్కరించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ‘కన్సల్టెంట్లు’ పరిష్కారం చూపిస్తారని బలంగా నమ్ముతున్న సర్కారు పెద్దలు.. పోలవరం విషయంలోనూ ఇదే మంత్రం జపించారు.


పోలవరం పనులు వేగవంతం చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని సూచించాలంటూ ‘కేపీఎంజీ’ అనే కన్సల్టెంటుకు బాధ్యతలు అప్పగించారు. ప్రాజెక్టు అథారిటీ సూచించినంత వేగంగా పనులు చేసే సామర్థ్యం కాంట్రాక్టర్‌కు లేదని, ‘సామర్థ్యం పెంపు’నకు అనుసరించాల్సిన మార్గాలనూ చెప్పాలని ‘కేపీఎంజీ’ కన్సల్టెన్సీని ప్రభుత్వం కోరింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను కన్సల్టెన్సీలకు అప్పగించింది.  నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని కన్సల్టెన్సీకి ప్రభుత్వం గడువు ఇచ్చింది. కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని, అథారిటీని చల్లబరిచి కాంట్రాక్టర్‌కు ఇబ్బందులు రాకుండా రక్షించాలనే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్ల సూచనలు, సలహాలు పాటించడానికి ససేమిరా అంటున్న ప్రభుత్వం.. కన్సల్టెన్సీలకు రూ. కోట్లు ఖర్చు పెట్టడాన్ని అధికారులు విమర్శిస్తున్నారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top