ఇలాగైతే కట్టలేం..

ఇలాగైతే కట్టలేం..


♦ తాత్కాలిక సచివాలయంపై చేతులెత్తేసిన నిర్మాణ సంస్థలు!

♦ 4 నెలల్లో పూర్తి చేయడం కష్టమంటున్న కంపెనీలు

♦ 12న శంకుస్థాపన అనుమానమే

 

 సాక్షి, విజయవాడ బ్యూరో: తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి బ్రేకు పడేలా ఉంది. తాము నిర్దేశించిన రేటుకే నిర్మాణాన్ని చేపట్టాలని, పైగా నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతుండడంతో నిర్మాణ సంస్థలు వెనకడుగు వేసినట్లు సమాచారం. దీంతో ఈ నెల 12న తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం కోసం ఆరు భవనాల నిర్మాణానికి సంబంధించిన మూడు ప్యాకేజీలకు గానూ రెండు ప్యాకేజీల్లో ఎల్ అండ్ టీ, ఒక ప్యాకేజీలో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు ఎల్1గా నిలిచాయి.



సీఆర్‌డీఏ చదరపు అడుగును రూ.3 వేలతో నిర్మించాలని నిర్దేశించగా.. ఈ సంస్థలు రూ.4 వేల నుంచి రూ.4,500కి (35% వరకు ఎక్సెస్) కోట్ చేశాయి. నిబంధనల ప్రకారం ఐదు శాతం ఎక్సెస్‌కే టెండర్లను ఆమోదించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిర్మాణ సంస్థలు కోట్ చేసిన మేరకు టెండర్లను ఆమోదిస్తే నిర్మాణ వ్యయం రూ.60 కోట్లు పెరిగి రూ.240 కోట్లకు చేరుతుంది. రూ.60 కోట్లు పెంచే పరిస్థితి లేదంటున్న ప్రభుత్వం.. టెండర్‌లో నిర్దేశించిన రేటుకే నిర్మాణాన్ని చేపట్టాలని, పైగా టెండర్‌లో పేర్కొన్నట్టుగా ఆరు నెలల్లో కాకుండా నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.



అయితే ప్రభుత్వం పేర్కొన్న రేటుకు నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చేయలేమని కంపెనీలు తేల్చిచెప్పినట్లు తెలిసింది. ‘టెండర్‌లో ఆరు నెలలని పేర్కొన్నా.. జూన్‌లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పబట్టే మేము ఎక్సెస్ కోట్ చేశాం. చదరపు అడుగుకు రూ.3 వేల చొప్పున నాలుగు నెలల్లో వెలగపూడి లాంటి చోట్ల నిర్మించడం కష్టం. నాలుగు నెలల్లో పూర్తి చేయాలంటే యంత్రాలు, నిర్మాణ సామగ్రి, కార్మికులకు రెండు రెట్ల అదనపు ఖర్చు అవుతుంది. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో అయితే లేబర్‌కు ఇబ్బంది ఉండదు కానీ వెలగపూడికి వారిని తీసుకెళ్లాలంటే చాలా ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది..’ అని ఆ సంస్థలు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఆ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నప్పటికీ వారు అంగీకరించే పరిస్థితి లేదని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.



 మళ్లీ టెండర్లు!: అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఈ సంస్థలు వెనుతిరిగితే మళ్లీ రీ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. తొలిసారే నిర్మాణ సంస్థలేవీ ముందుకు రాకపోవడంతో ఈ రెండింటినీ ఒప్పించి టెండర్లు వేయించారు. ఇప్పుడు అవి వెనక్కిపోతే వేరే వి వచ్చే పరిస్థితి లేదని సీఆర్‌డీఏ వర్గాలంటున్నాయి. అలాగని అధిక రేటును ఆమోదించడమూ కష్టమేనంటున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top