రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ నేత మృతి


రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ నేత తేజేశ్వరరావు మృతి

మరో నాయకుడికి తీవ్ర గాయాలు

శ్రీశైలం నుంచి తిరిగి వస్తుండగా ఘటన  




మధురవాడ (భీమిలి) : మహా శివరాత్రి రోజున శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని తిరిగి వస్తుండగా పాయకరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన చంద్రంపాలేనికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొల్లు తేజేశ్వరరావు(43) శనివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు. జీవీఎంసీ 5వ వార్డు మిధిలాపురి వుడా కాలనీకి చెందిన కాంగ్రెస్‌ వార్డు కార్యదర్శి మజ్జాడ వెంకట రమణమూర్తి తీవ్రంగా గాయపడి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తేజేశ్వరరావు, రమణమూర్తి కారులో శ్రీశైలం యాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పాయకరావుపేట దేవినగర్‌ వద్ద ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. కారు నడుపుతున్న రమణమూర్తి, తేజేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు.



చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తేజేశ్వరరావు చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11.30 గంటలకు మృతి చెందారు. తేజేశ్వరరావుది శ్రీకాకుళం జిల్లా కాగా.. 30 ఏళ్ల కిందటే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన నాయకుడిగా పేరొందారు. తేజేశ్వరరావుకు భార్య రమాదేవి, కుమారుడు జీవన్‌కుమార్‌(5), కుమార్తె కాత్యాయని(3) ఉన్నారు. మృతుని కుటుంబానికి పీసీసీ కార్యదర్శి పోతిన వరం, పార్టీ 5వ వార్డు అధ్యక్షుడు పిళ్లా సూరిబాబు, సీనియర్‌ నాయకుడు పోతిన వెంకటరమణబాబు, తదితరులు సంతాపం తెలిపారు. తేజేశ్వరరావు  మృతితో చంద్రంపాలెంలో విషాదం అలముకుంది. మహా శివరాత్రి రోజున పరమశివుని దర్శనం కోసం వెళ్లి వస్తూ అందని లోకాలకు చేరుకోవడం అందరినీ కలచివేసింది. పెద్ద దిక్కును కోల్పోయి తేజేశ్వరరావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top