విరిగిన లాఠీ

విరిగిన లాఠీ


ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో గందరగోళం

వేలాదిగా తరలి వచ్చిన యువత

తొక్కిసలాటలో చిరిగిపోయిన సర్టిఫికెట్లు

విరుచుకుపడిన పోలీసులు..

లాఠీచార్జి  పలువురికి గాయాలు

సమాచారంలో విఫలమైన అధికారులు

పోలీస్ అవతారమెత్తిన డిఆర్‌డిఏ  పీడీ సత్యసాయి శ్రీనివాస్


 

దేశభక్తితో కొందరు.. పొట్ట పోషించుకునేందుకు

మరికొందరు.. యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆర్మీలో చేరి ఉపాధి పొందాలని తాపత్ర యపడ్డారు. వీరిలో చాలా మంది శుక్రవారం పోలీసుల లాఠీచార్జ్‌లొనూ తరవాత తొక్కిసలాటలోనూ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖలో తొలిరోజే ఆర్మీ ర్యాలీ గందరగోళమైంది.

 

విశాఖపట్నం: కొలువు కోసం వెళ్లిన నిరుద్యోగిపై లాఠీ విరిగింది..అధికారుల సమాచారలోపం వారికి నరకాన్ని చూపించింది. నియంత్రణ పేరుతో పోలీసులు చితకబాదడంతో కదల్లేని పరిస్థితి ఎదురైంది. బతుకు జీవుడా అంటూ తీవ్ర గాయాలతో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. శుక్రవారం ఆర్మీర్యాలీకి వెళ్లిన నిరుద్యోగులకు ఎదురైన చేదు అనుభవమిది. ఆర్మీలో పలు ఉద్యోగాల కోసం  ఈ నెల 13వ తేదీ వరకూ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శుక్రవారం నుంచి నగరంలో ప్రారంభమైంది. తొలిరోజు వెలంపేటలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో విశాఖ, అనకాపల్లి డివిజన్ల అభ్యర్ధులకు టోకెన్లు జారీ చేశారు. దీనికి దాదాపు ఏడు వేల మందికి పైగా అభ్యర్ధులు హాజరయ్యారు. దరఖాస్తుల్లో సూచించిన తేదీలకు తర్వాత ప్రకటించిన తేదీలకు ఒక రోజు వ్యత్యాసం ఉండటంతో ఇతర డివిజన్ల నుంచి కూడా అభ్యర్ధులు వచ్చేశారు. నిజానికి ఇంత మంది అభ్యర్ధులు వస్తారనే అంచనా ముందుగానే అధికారులకు ఉన్నప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయలేకపోయారు. తాగునీరు కూడా అభ్యర్ధులకు అందించలేదు. ముందురోజు రాత్రి నుంచే స్టేడియం వద్దకు చేరుకున్న అభ్యర్ధులను విడతల వారీగా టోకెన్లు తీసుకునేందుకు అనుమతించారు. దీని కోసం బారికేడ్లు నిర్మించారు. అక్కడక్కా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ముందు వచ్చిన వారికి ముందు టోకెన్లు ఇస్తామని అధికారులు చేసిన ప్రకటన అభ్యర్ధులకు చిక్కులు తెచ్చిపెట్టింది. టోకెన్ తీసుకోవాలనే ఆరాటంలో బారికేడ్లుపై నుంచి దూకడం, కింది నుంచి దూరి వెళ్లడం వంటివి చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది. టెంట్లు, బారికేడ్లు కూలిపోయాయి. దీంతో తర్వాత నుంచి ఎండల్లోనే కూర్చున్నారు. పక్కనే పళ్ల మార్కెట్, స్టేడియంను ఆనుకుని డ్రైయిన్ ఉండటంతో ఆ డ్రైయిన్‌లోని ఈగలు అభ్యర్ధులపై దాడిచేశాయి. అవి తేనెటీగలేమోనని బెదిరిపోయిన అభ్యర్ధులు పరుగులు తీయడంతో మరోసారి తొక్కిసలాట జరిగింది.



పలుమార్లు లాఠీచార్జ్: టోకెన్ల కోసం ముందుకు దూసుకువస్తున్న అభ్యర్ధులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. డిఆర్‌డిఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ సైతం పోలీసులు ఉపయోగించే లాఠీ పట్టుకుని యువకులను చావబాదారు. పలుమార్లు జరిగిన లాఠీ చార్జ్‌లో అనేక మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి తలలు పగిలాయి. కొందరికి కాళ్లు విరిగాయి. ఈ గందరగోళంలో అభ్యర్ధుల పర్సులు, సెల్‌ఫోన్లు, బ్యాగులు పోయాయి. వెంట తెచ్చుకున్న సర్టిఫికెట్లు చిరిగిపోయాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలకు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాధమిక చికిత్స చేశారు.

 

ఖర్చులకు డబ్బుల్లేవ్

రెండో తారీకునే టోకెన్లు ఇచ్చేస్తామని ముందు చెప్పారు. తర్వాత తేదీలు మార్చారంట. ఆ విషయం మాకెలా తెలుస్తుంది.క్లర్క్ పోస్టు పరీక్షకు రెండు రోజుల క్రితమే వైజాగ్ వచ్చేశాం. ఇక్కడ ఉండటానికి ఏమీ లేదు.ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నాం. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి.

 -ఎ.రాజు, శ్రీకాకుళం

 

 నిబంధనలు మార్చేశారు

 ఈ సారి ఆర్మీ సెలక్షన్లలో పాత నిబంధనలు మార్చేశారు. గతంలో ఒకరు ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఒకదాంట్లో ఫెయిల్ అయితే మరోదానికి ప్రయత్నించేవాళ్లం. ఇప్పుడు ఒకరు ఒక పోస్టుకే పరీక్షకు హాజరవ్వాలని, ఒక టోకెన్ మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగాలు రావు.            -కె.ఆదిత్య, పరవాడ

 

 అంతా గందరగోళం


 టోకెన్ల జారీ, పరీక్షల తేదీల్లో స్పష్టత లేదు. దీంతో తేదీలు ఖచ్చితంగా తెలుసుకోవాలని వచ్చాం. ఇక్కడ సమాచారం చెప్పేవాళ్లు కూడా లేరు. వచ్చిన తోటి అభ్యర్ధులను అడిగి వివరాలు తెలుసుకున్నాం.మళ్లీ వెనక్కు వెళ్లి రాలేం. ఇక్కడే ఎక్కడో కాలం గడపాలి.             -జె.సుధీర్, శ్రీకాకుళం

 

 ఎప్పుడో వచ్చాం

 టోకెన్లు ఇస్తామంటే 2వ తేదీన వచ్చాం. కానీ ఇవ్వలేదు. మళ్లీ ఈ రోజు వచ్చాం. ట్రేడ్‌మెన్ ఉద్యోగం కోసం పరీక్షకు హాజరవుతున్నాం. ఉదయం నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం. మాలో చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి.

 -ఎం.అప్పలరామశ్రీను, విశాఖ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top