తప్పుకదా.. మాస్టారూ!

తప్పుకదా.. మాస్టారూ!


► పాయింట్ల కోసం అడ్డదార్లు తొక్కుతున్న అయ్యవార్లు

► స్పౌజ్‌ పాయింట్లు కేటాయింపుల్లో అక్రమమార్గం

► కొంతమంది విద్యాశాఖ సిబ్బంది సహకరిస్తున్నట్లు సమాచారం

► కానరాని పారదర్శకత.. కొనసాగుతున్న గందరగోళం

► వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు

► కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలంటున్న ఉపాధ్యాయులు




కోరుకున్న చోటుకు వెళ్లేందుకు అయ్యవార్లు అడ్డదారులు తొక్కుతున్నారు. బదిలీల నిబంధనల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని ఎక్కువ పాయింట్లు పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొందరు అధికారులు కూడా సహాయపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాగైనా మంచిస్థానం సంపాదించాలని 20శాతం ఇంటి అద్దె ఉండే ప్రాంతాలకు బదిలీ కావాలని పక్కదారులను ఎంచుకుంటున్నారు. ప్రత్యేక కేటగిరి కింద ఉన్న ఉపాధ్యాయులకు ముందుగా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. కనుక వారు కోరుకున్న పాఠశాలలు లభిస్తాయనే ఆలోచనతో దొంగ సరిఫికెట్లు పుట్టించడానికి కూడా వెనుకాడటం లేదు.



కడప ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి వివిధ అంశాలపై పాయింట్లు కేటాయింపు వరకూ ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైన విధానం, పారదర్శకత లేక అడుగడుగునా సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏప్రిల్‌లో మొదలుపెట్టిన బదిలీల ప్రక్రియ జూలై సగం పూర్తయినా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొదట 50శాతం పనితీరు సూచికలు, వెబ్‌ కౌన్సెలింగ్‌తో టీచర్ల బదిలీల ప్రక్రియ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధ్యాయులంతా ఆందోళన బాట పట్టారు. వేలాదిమంది ఉపాధ్యాయులతో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి 50శాతం పనితీరు సూచికలను 30శాతానికి తగ్గించడం, వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు చేసి మ్యానువల్‌ పద్ధతిలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని జీఓ నంబర్‌ 42ను విడుదల చేసింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది.



లోపాల కోసం వెతుకులాట

బదిలీల నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అయ్యవార్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు అవినీతి అధికారుల సహకారం తీసుకుని కోరుకున్న ప్రాంతం కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. ఇందులోభాగంగా ప్రత్యేక కేటగిరి కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ కేటగిరి కిందికి రావాలంటే 70శాతంకు పైగా అంగవైకల్యం ఉండాలి. క్యాన్సర్, బైపాస్, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి వ్యాధులకు గురై ఉండాలి. మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న తల్లిదండ్రులను కూడా ప్రత్యేక కేటగిరి కింద చేర్చుతారు. దీనిని అవకాశంగా తీసుకున్న కొంతమంది ఉపాధ్యాయులు తమ పలుకుబడిని ఉపయోగించి, డబ్బులు ఖర్చుపెట్టి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. వాస్తవంగా 40 నుంచి 50 శాతం వైకల్యం ఉన్నవారు 70శాతం ఉన్నట్లుగాను, పిల్లలకు మానసిక రోగాలు, నరాల సంబంధిత వ్యాధులు ఉన్నట్లుగా రిమ్స్‌ నుంచి దొంగ సర్టిఫికెట్లు పొందుతున్నారు. వాటిని ఉపయోగించి మంచి స్థానాలు పొందడానికి ప్రయత్నాలు చేçస్తున్నట్లు తెలిసింది.  



వరంలా 4వ కేటగిరి

అలాగే 4వ కేటగిరి కింద పాఠశాలను చేర్చితే ఏడాదికి 5 పాయింట్లు వస్తాయి. దీంతో వారు కోరుకున్న పాఠశాలను చేజిక్కించుకోవచ్చని, అయా బడులను ఎలాగైనా 4వ కేటగిరి కింద మార్చడానికి రూ.వేలు ఖర్చుపెడుతున్నట్లు సమాచారం. మండలంలో పలుకుబడిని ఉపయోగించి పంచాయతీరాజ్‌ ఇంజనీర్లతో రోడ్డు సౌకర్యం లేదని రాయించుకుంటున్నారు. వాటిని పీఆర్‌ అధికారుల ద్వారా డీఈఓ కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిసింది. డీఈఓ కార్యాలయంలోని కొందరు సిబ్బందిని ఉపయోగించుకుని తమ పనిని పూర్తి చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. నిబంధనల మేరకు ఏ కాలంలోనైనా నడవడానికి వీలులేని రహదారులు ఉన్న పాఠశాలు మాత్రమే 4వ కేటగిరి కిందికి వస్తాయి.



2009 నుంచి కేటగిరి వారీగా వివరాలు

4వ కేటగిరి కింద 2009 బదిలీల్లో 114 పాఠశాలలు, 2011 బదిలీల్లో 217  పాఠశాలలు, 2013 బదిలీల్లో 13 పాఠశాలలు, 2015కు 57 పాఠశాలలుగా చేర్చారు. 2009, 2011, 2013ల్లో జరిగిన బదిలీలలో లేని పాఠశాలలు కూడా 2015లో 4వ కేటగిరి కింద ప్రత్యక్షమయ్యాయి. ఉదాహరణకు చాపాడు మండలంలోని రామదాసుపురం, పొద్దుటూరు మండలంలోని ఎర్రగుంట్లపల్లె. ఈ రెండు పాఠశాలలు 2015 వరకు కూడా 3 కేటగిరి కింద ఉన్నాయి. 2015లో మాత్రం ఈ రెండు పాఠశాలలు 4వ కేటగిరికి వచ్చాయి. 2015లో 4వ కేటగిరి చేర్చిన కొన్ని పాఠశాలలకు 2009 నుంచే 4వ కేటగిరి కింద పాయింట్లు ఇచ్చినట్లు సమాచారం.



కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలి

నిజాయితీగా పనిచేసిన ఉపాధ్యాయులు కొంతమంది అధికారులు తీరు కారణంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపైన కలెక్టర్‌ జోక్యం చేసుకుని బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లాలోని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రత్యేకించి నాల్గవ కేటగిరి పాఠశాలలు, స్పౌజ్‌ పాయింట్లు కేటాయింపు, ప్రత్యేక కేటగిరికి చెందిన  ఉపాధ్యాయులను కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమగ్రంగా విచారణ జరిపించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top