‘బాబు’కు పవరు.. జాబుకు ఎసరు


మండపేట :గృహ నిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నట్టుండి నిరుద్యోగులుగా మారిపోయారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్న ప్రచారం కేవలం ఎన్నికల లబ్ధి కోసమేనని రుజువు చేస్తూ ఆ శాఖలో 172 మందిని ఒక్క సంతకంతో నిరుద్యోగులుగా మార్చేశారు. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో జిల్లాలోని 172 మందికి హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పిం చారు. వీరిలో 28 మంది కంప్యూటర్ ఆపరేటర్‌లు కాగా మిగిలినవారు వర్క్ ఇన్‌స్పెక్టర్‌లుగా పనిచేస్తున్నారు. వీరికి హైదరాబాద్‌కు చెందిన ఎంకే  ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ద్వారా ఒక్కొక్కరికి జీతాలు అందజేసేవారు. కంప్యూటర్ ఆపరేటర్లు గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఫీడ్ చేయడంలో వీరు కీలక భూమిక పోషిస్తున్నారు.

 

 వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు కూడా నిత్యం క్షేత్రస్థాయిలో తిరుగుతూ శాఖకు సంబంధించిన పనులు సకాలంలో సక్రమంగా పూర్తి అయ్యేందుకు దోహదపడ్డారు. కీలక  బాధ్యతలు నిర్వహిస్తున్న వీరిని చంద్రబాబు సీఎం కాగానే  ఉద్యోగాలనుంచి తొలగిస్తూ 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నవంబర్ నుంచి హౌసింగ్‌శాఖలో ఇందిరమ్మ ఇళ్ల జియో టాగింగ్ ప్రక్రియ మొదలు కావడంతో వారిని తాత్కాలికంగా కొనసాగించారు. ప్ర స్తుతం జియో టాగింగ్ పూర్తి  కావడం తో వారిని తొలగిస్తూ  ఈనెల 26న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగులకు ఆ విషయం ఆన్‌లైన్ ద్వారా సోమవారం తెలిసింది. దీంతో 172 మంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారిపై ఆధారపడ్డ కుటుంబాలు నడిరోడ్డున పడే దుస్థితి దాపురించింది.

 

 ఉన్న ఉద్యోగాలే ఊడగొడతారా?

 ఎనిమిది సంవత్సరాలుగా అరకొరజీతాలతో ప్రభుత్వానికి సేవలందించిన వారి శ్రమ నిష్పలంగా మిగిలింది. ఇంతకాలం సేవలు చేయించుకున్న ప్రభుత్వ పెద్దలు కనికరం లేకుండా ఉన్నట్టుండి రోడ్డుమీదకు నెట్టేశారని వారు ఆవేదన చెందుతున్నారు. తమపైనే ఆధారపడ్డ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. బాబు వస్తే కొత్త ఉద్యోగాలు రావడం మాట అటుంచితే ఉన్న ఉద్యోగులనే నిరుద్యోగులను చేయడం దురదృష్టకరమని వాపోతున్నారు. ప్రభుత్వం తమ కష్టాలను దృష్టిలో ఉంచుకుని తమ ఉద్యోగాలను తమకు ఇప్పించాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనబాట పట్టడం తప్ప తమకు మరోమార్గం కానరావడం లేదంటున్నారు. ఈ దిశగా కార్యాచరణకు సోమవారం విజయవాడలో సమావేశ మయ్యారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top