అతివల అదృశ్యంపై ఆందోళన

అతివల అదృశ్యంపై ఆందోళన


వివాహేతర సంబంధం..

ప్రేమ వ్యవహారం..

ఉద్యోగాలు..

డబ్బుపై ఆశ..

ఆదరణ లేకపోవడం..

ఇంట్లో అలగడం..

దూరపు చదువులు..

.. ఇలా సందర్భం ఏదైనా కావొచ్చు. మహిళ లేదా బాలిక కాలు తీసి బయట పెట్టిందంటే ఆమె రక్షణకు గ్యారంటీ లేదు. మహిళ.. అయితే చాలు ప్రమాదం ఏ రూపంలోనైనా ముంచుకు రావొచ్చు. మహిళల బలహీనతలు ఆసరా చేసుకుని వారిని వ్యభిచారం రొంపిలోకి దించే ముఠాలు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కాచుకుని కూర్చొంటాయి. మహిళ ఒంటరిగా కనబడితే చాలు బ్రోకర్లకు పండగే. ఎలాగైనా లోబర్చుకుని లేనిపోని ఆశలు చూపి జీవితాన్ని బుగ్గిపాలు చేసేందుకూ వెనకాడరు.

 

- ఏటా 10 నుంచి 20 మంది మహిళల ఆచూకీ గల్లంతు

- ఢిల్లీ వ్యభిచార గృహంలో జిల్లాకు చెందిన యువతి

- రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని అమ్మేసిన మోసగాడు

- ఢిల్లీ పోలీసుల ‘ఆపరేషన్’లో బాధితురాలికి విముక్తి

ఒంగోలు క్రైం :
జిల్లాలో బాలికలు, మహిళలు ఏటా అదృశ్యమవుతున్నారు. కొద్దికాలం తర్వాత కొందరి ఆచూకీ తెలుస్తున్నా మరికొందరు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియలేదు. మూడేళ్ల నుంచి అదృశ్యం కేసుల వివరాలు పరిశీలిస్తే మహిళలకు ఉన్న భద్రత ఏ పాటిదో అర్థమవుతోంది. వివాహేతర సంబంధాలు.. ప్రేమ వ్యవహారం.. బతుకువేటలో ఇల్లు వదిలి బయటకు వెళ్లడం.. ఉద్యోగాల ఆశ చూపడం.. ఇంట్లో అలిగి వెళ్లడం.. సందర్భం ఏదైనా కావొచ్చు.. మహిళ బయటకు వెళ్లిందంటే చాటు ఇట్టే అదృశ్యమైపోతోంది.



ఫలితంగా రక్తసంబంధీకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. నయవంచకుల కబందహస్తాల్లో చిక్కి అతివలు అల్లాడిపోతున్న సందర్భలూ లేకపోలేదు. మహిళల, బాలికల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అతివలు గడపదాటితే తిరిగి ఇంటికి వచ్చే వరకూ ఇంట్లోని పెద్దలకు నిద్రపట్టడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసుల లెక్కల ప్రకారం ఏటికేడు మహిళల అదృశ్యం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అదృశ్యమైన వారిలో 5 నుంచి 10 శాతం వరకు ఏళ్లు గడిచినా వారి ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు.

 

వ్యభిచార గృహాలకు తరలింపు

కొంతమంది అమాయక బాలికలు, మహిళలు ఎవ రో ఒకరి చేతిలో మోసపోయి చివరకు వ్యభిచార గృహాల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఢిల్లీలోని ఓ వ్యభిచార గృహంలో జిల్లాకు చెందిన యువతి ఆచూకీ ఇటీవల లభ్యం కావడం అదృశ్యమైన మహిళల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఓ నయవంచకుడు సదరు యువతికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆమెను నమ్మకంగా తన వెంట ఢిల్లీ తీసుకెళ్లాడు. చివరకు ఆ మోసగాడు వ్యభిచార గృహానికి ఆమెను నిలువునా అమ్మాడు. ఎంతకమ్ముకున్నాడో ఏమోగానీ ఆమె ఏడాదిగా వ్యభిచార రొంపిలో పడి కమిలిపోయింది. తీరా ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ ‘ముక్తి’ పేరిట చేపట్టిన దాడుల్లో గౌతమ్‌బుద్ధ రోడ్డులోని ఓ వ్యభిచార గృహంలో ఆ మహిళ పోలీసుల కంట పడింది. దీంతో ఆమెకు ఆ రొంపి నుంచి విముక్తి లభించడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఇవిగో..సాక్ష్యాలు

- మద్దిపాడు మండలం తెల్లబాడుకు చెందిన 14 ఏళ్ల బాలికను ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సుమతి అనే మహిళ ఆరు నెలలుగా నిర్బంధించింది. బాలికను వ్యభిచారం రొంపిలోకి దింపి పచ్చటి బాల్యాన్ని సర్వనాశనం చేసింది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె ఆచూకీ తెలపండంటూ పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. అభం శుభం తెలియని 14 ఏళ్ల బాలిక జీవితాన్ని బుగ్గిపాలు చేశారు. చివరకు పోలీసులు నిందితురాలు సుమతిని కటకటాల్లోకి నెట్టి..బాలికను హోంకు తరలించారు.

- కొత్తపట్నంకు చెందిన యువతిని బంధువులామె ఇంట్లో శుభకార్యమని పిలిపించుకొని ముంబైకి చెందిన వ్యభిచార గృహం నిర్వాహకులకు అమ్మింది. ఆ కేసును కూడా జిల్లా పోలీసులు ఛేదించారు.

- ‘పిన్నే పిశాచీ’ఉదంతాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వేటపాలేనికి చెందిన ఓ యువతిని నెల్లూరు జిల్లా అల్లూరులో ఉంటున్న సొంత పిన్ని అక్కడికి తీసుకెళ్లి వ్యభిచారం రొంపిలోకి దింపింది. యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో తానే ఆలనా.. పాలనా చూస్తానని బంధువులతో నమ్మ బలికి తీసుకెళ్లింది. తీరా ఆ యువతి ఆచూకీ తెలపాలంటూ నాయనమ్మ పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయమేమంటే పిన్నే ఆ యువతిని రూ.20 వేలకు అల్లూరులోని వ్యభిచార గృహంలో అమ్మేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు జిల్లాలో చోటుచేసుకున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top