ఆంధ్రప్రదేశ్ షట్ డౌన్

ఆంధ్రప్రదేశ్ షట్ డౌన్ - Sakshi


హోదా కోసం ఎలుగెత్తిన రాష్ట్రం... బంద్ సంపూర్ణం, స్వచ్ఛందం

 


విజయవాడ బ్యూరో/నెట్‌వర్క్: ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ శనివారం తలపెట్టిన బంద్ విజయవంతానికి ప్రజలంతా ఒక్కటయ్యారు. బంద్ విఘ్నానికి చంద్రబాబు సర్కార్ ఎన్ని ప్రతిబంధకాలు కల్పించినా జనం నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ‘సత్తా చూపిద్దాం-ప్రత్యేక హోదా సాధిద్దాం’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఫలితంగా ‘ప్రత్యేకహోదా-ఆంధ్రుల హక్కు’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నినదించారు. ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో కుట్రపన్ని అక్రమ అరెస్టులకు పోలీసులను ఉసిగొల్పినా ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి మద్దతుగా నిలిచి ప్రత్యేకహోదా డిమాండ్‌ను గొంతెత్తి చాటారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనకు ఉవ్వెత్తున లేచిన ప్రజాగ్రహాన్ని భగ్నం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. ఇందుకోసం పోలీసులను ఉసిగొలిపింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విజయవాడ కేంద్రంగా చంద్రబాబు డెరైక్షన్‌లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల ద్వారా భగ్నం చేసేందుకు ప్రభుత్వం తమ శక్తియుక్తులన్నీ వినియోగించింది. రాష్ట్రవ్యాప్తంగా 40మందికి పైగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, వేలాది మంది ఇతర ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ  శ్రేణులను, వామపక్ష నేతలు, కార్యకర్తలను, చివరకు సాధారణ ప్రజానీకాన్ని అరెస్టుచేసి భయోత్పాతాన్ని సృష్టించేందుకు సర్కారు యత్నించింది.  కొన్నిచోట్ల రోడ్డుపక్కన దీక్ష చేస్తున్న నేతలపైనా, పాల్గొన్న జనాలపైనా విచక్షణారహితంగా దాడికి దిగింది.  ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్న ఆందోళనపై మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ పోలీసులతో ఇలా వ్యవహరింపజేయలేదని వివిధ రాజకీయ వర్గాలు ఆక్షేపించాయంటే చంద్రబాబు సర్కారు బంద్‌ను భగ్నం చేసేందుకు ఎలా వ్యవహరించిందో.. ఎంతదూరం వెళ్లిందో ఇట్టే అర్థమవుతోంది.



అన్ని వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు..

ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొనడంతోపాటు ప్రైవేటు వాహనాల యజమానులూ మద్దతు ఇవ్వడంతో అన్ని జిల్లాల్లోనూ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను నడిపి బంద్ విఫలమైందని చెప్పేందుకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. ఇందుకోసం పోలీసు బలగాలను పెద్దఎత్తున వినియోగించింది. ఇందుకు వైఎస్సార్‌సీపీ, వామపక్షాలకు చెందిన ముఖ్య నేతలను ముందస్తు అరెస్టులు చేయించింది. కార్మికులు, సిబ్బంది స్వచ్ఛం దంగా పాల్గొనడంతో బస్సులు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల పోలీసులు బలవంతంగా బస్సులను నడిపేందుకు విశ్వప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాస్తారోకోలు, ధర్నాలు, భారీ మోటార్‌సైకిల్ ర్యాలీలు, జాతీయరహదారుల దిగ్బంధంతో జనజీవనం స్తంభించిపోయింది. చెన్నై, బెంగళూరు, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జాతీయ రహదారులపై రాస్తారోకోలతో రాకపోకలు నిలిచిపోయాయి.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. రాఖీ పండుగ సందర్భంగా విద్యాలయాలకు ప్రకటించిన ఐచ్ఛిక సెలవును బంద్ పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం ఆనక రద్దుచేసింది. పాఠశాలలను తెరిపించేందుకు ప్రయత్నించినా స్వచ్ఛందంగా మూసివేసి యాజమాన్యాలు మద్దతిచ్చాయి. ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షలు నిలిచిపోయాయి. ఉద్యోగులు యూనివర్సిటీలో ఒక రోజు నిరహారదీక్ష చేపట్టారు. చాంబర్ ఆఫ్ కామర్స్, పెట్రోలు బంకుల యజమాన్యాల అసోసియేషన్ మద్దతుతో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. విశాఖపట్నంలో మహిళలు పోలీసులకు రాఖీలు కట్టి ప్రత్యేకహోదా కోసం మద్దతు ఇవ్వాలంటూ నిరసన తెలియచేశారు.   



పోలీసుల దౌర్జన్యం..: రాజమండ్రిలో అక్రమంగా అరెస్టుచేసిన జక్కంపూడి గణేష్, ఆదిరెడ్డి వాసులను విడిచిపెట్టాలని అడిగేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సుంకర చిన్నిలపై అక్కడి ప్రకాష్‌నగర్ పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.  జక్కంపూడి రాజాపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి, అరెస్టు చేశారు. ఇదే సందర్భంలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిని మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించి వ్యాన్ ఎక్కించి గోకవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాడేరులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఎక్కడో దూరంగా పెదబయలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  తిరుపతిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిల్ని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించారు.



జక్కంపూడితో మాట్లాడిన జగన్..

 పోలీసులు అక్రమంగా నాన్‌బెయిలబుల్ కేసు బనాయించి అరెస్టు చేసిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజాతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఉద్యమాలు నిర్వహించేటప్పుడు టీడీపీ హయూంలో తప్పుడు కేసులు పెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ధైర్యంగా ఉండాలని, తానూ, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top