కబ్జాలో పోటీ.. స్థలాలన్నీ లూటీ

కబ్జాలో పోటీ.. స్థలాలన్నీ లూటీ - Sakshi


- మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జుల భూదందా

- వర్గాలుగా స్థలాల దురాక్రమణ

- అనుచరులకు పట్టాలు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి

- రెవెన్యూ పరోక్ష సహకారం

సాక్షి ప్రతినిధి, గుంటూరు :
మాచర్ల నియోజకవర్గంలోని టీడీపీ నేతలు పోటీపడి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆ నియోజకవర్గానికి ఇద్దరు ఇన్‌చార్జులను నియమిస్తే, ఆ ఇద్దరూ వర్గాలుగా విడిపోయి ప్రభుత్వ స్థలాల కబ్జాను ప్రోత్సహిస్తున్నారు. అనుచరులకు పట్టాలు ఇవ్వాలి, పనులు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు ప్రభుత్వ పథకాల కోసం అనుచరులతో దరఖాస్తులు చేయిస్తున్నారు. పేదల దరఖాస్తుల కంటే ఆ ఇద్దరి అనుచరుల దరఖాస్తులే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నివేశన స్థలాల కోసం ఇరువర్గాల అనుచరులు చేసిన దరఖాస్తుల సంఖ్య మూడు వేలకు చేరింది.



మాచర్ల నియోజకవర్గానికి కొమ్మారెడ్డి చలమారెడ్డి, చిరుమామిళ్ల మధులు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరు పార్టీలో రెండు వర్గాలుగా కొనసాగుతుండగా, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి అధికార పార్టీలో తన హవా చూపేందుకు ఎంపీ రాయపాటి సాంబశివరావు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. పురపాలక సంఘంలోనూ రెండు వర్గాలుగా చీలిపోయి అభివృద్ధిని విస్మరించి పర్సంటేజీలు, పైరవీలకు పాల్పడుతున్నారు. రెండు వర్గాలు ప్రజా సమస్యల్ని మరచి సొంత ప్రయోజనాల కోసం ఘర్షణ పడుతూ నియోజకవర్గాన్ని అక్రమాలకు నిలయంగా మార్చేశారు. పట్టణంలోని ఎస్‌కెబీఆర్ కళాశాల ప్రాంతంలో ఖాళీగా ఉన్న మూడు ఎకరాల భూమిని ఒక వర్గం నాయకులు ముందుగానే ఆక్రమించగా మరో వర్గం నాయకులు 7వ వార్డులో ఖాళీగా ఉన్న స్థలాలను ఆక్రమించేందుకు రాళ్లు వేసి స్థలాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు పక్క నియోజకవర్గ నాయకులతో అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

 

అక్కడ రెవెన్యూ అంతే ...

పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వర్గాలు ఇదే రీతిలో వ్యవహరిస్తుంటే, రెవెన్యూ అధికారులు కబ్జాలను నిలువరించే ప్రయత్నం చేయ కపోగా,  వారికి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ముందు స్థలాన్ని ఆక్రమించుకోండి...ఆ తరువాత దరఖాస్తు చేసుకోండని రెవెన్యూ ఉద్యోగులు సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. నిజాయితీగా పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఆ ఇద్దరి బాధలు తట్టు కోలేకపోతున్నామని, మరో నియోజకవర్గానికి బదిలీ చేయించుకుంటామని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. రేట్లు అధికంగా ఉండటంతో పట్టణంలోని స్థలాలపైనే గురిపెట్టారు. ఇక మండల స్థాయి నాయకులు రూరల్‌లోని వేలాది ఎకరాలను కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారు.

 

ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్ట..

ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందుగానే ఇద్దరూ ఇన్‌చార్జుల అనుచరులు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యక్షమౌతున్నారు. మా పట్టాలు ఏమయ్యాయి? మా పనేమైంది అంటూ అధికారులను సతాయిస్తున్నారు. కొంతమంది గంటల కొద్దీ కార్యాలయాల్లోనే తిష్ట వేస్తుండటంతో అధికారుల పనులకు ఆటంకం ఏర్పడుతోంది. సామాన్య ప్రజల పనుల కంటే పార్టీ కార్యకర్తల పనులకే సిబ్బంది ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top