ఏదీ అమలు...!


ఒంగోలు సెంట్రల్ : దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా తయారయింది మందుల విక్రయదారుల తీరు. ప్రభుత్వం మందుల ధరలు తగ్గించినా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.  దీన్ని పర్యవేక్షించే నాధుడే కానరాకపోవడంతో మందుల దుకాణ వ్యాపారులు అడింది ఆటగా తయారవుతోంది. జిల్లా యంత్రాంగం కూడా ప్రేక్షకపాత్ర వహించడంతో రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కొనుగోలుదారుడు గుర్తించి ప్రశ్నిస్తేగానీ తగ్గింపు అమలు చేయడం లేదు. అయితే ఈ విషయం తెలిసిన రిైటె ల్ అమ్మకం ధారులు మాత్రం తక్కువ ధరలకే హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. రోగి అనే కనికరం కూడా లేకుండా అడ్డంగా దోచేస్తున్నారు.



20 శాతం సాధారణ రోగాలు వస్తుంటే, 18 శాతం మందికి మధుమేహం, రక్తపోటు, 15 శాతం మందికి మూత్ర పిండాల సమస్యలు, 7 శాతం మందికి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు అంచనా, దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా రోగాలకు సంబంధించి ప్రజలు నెలనెలా రూ.15 కోట్లు పైబడి ఔషధాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న ఔషధాల కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నాయి.

     

ఔషధాల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను 45 రోజుల్లోగా మందుల కంపెనీలు అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగా లేని మందుల రకాల నిల్వలను రిటైలర్లు, హోల్‌సేల్ వర్తకులు ఆయా పరిశ్రమలకు తిరిగి అందజేయాలి. అనంతరం కంపెనీలు నూతన ధరలు ముద్రించి విక్రయించాలి. జిల్లాలో సుమారు 2 వేల మందుల దుకాణాలున్నాయి. వీటితో పాటు మరో 300 వరకు హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లున్నారు. నెలకు కోట్లలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి.



 ధర తగ్గిన మందులివీ...

 ప్రస్తుత విధానంలో డిస్ట్రిబ్యూటరీ స్థాయిలో 2 శాతం, చిల్లర స్థాయిలో 6 శాతం లాభాలు తగ్గి రోగులకు ప్రయోజనం చేకూరనుంది. ధరలు తగ్గే మందుల్లో గ్లెక్లెజైడ్ మాత్రల్లో పలు పరిమాణాలు, గ్లిమిప్రైడ్, మిగ్లిటాల్, అమ్లెడిపిన్, మెట్‌ఫార్మిన్, ఎనాలాప్రిల్, అటెనోలాల్, లిసినోప్రిల్, మెటోప్రోలోలాల్, అటార్వోస్టాటిన్, సిమ్వాస్టాటిన్, ఫినోఫైబ్రేట్, క్లోపిడోగ్రిల్, ఐనోసార్బైట్, డిల్టియాజెమ్ వంటి రకాలు ఉన్నాయి. ఇవన్నీ మధుమేహం, అధిక రక్తపోటు, చెడు కొలస్ట్రాల్, గుండెజబ్బు తదితర ఆరోగ్య సమస్యలకు ఉపయోగించే 108 మందుల రకాలున్నాయి. దీంతో మందుల ధరలు రకాల వారీగా పది నుంచి ముప్పై శాతం వరకూ తగ్గనున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top