ఎంబీబీఎస్‌కు కామన్ ఫీజు

ఎంబీబీఎస్‌కు కామన్ ఫీజు - Sakshi


వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!

10 రోజుల్లో ప్రభుత్వానికి ఏఎఫ్‌ఆర్సీ నివేదిక

ఏడాదికి రూ. 5 నుంచి 6 లక్షలే!


 

 హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థులకు తీపికబురు! ఇప్పటి వరకు ఏ, బీ, సీ కేటగిరీలుగా ఉంటూ ఫీజుల చెల్లింపులో భారీ వ్యత్యాసాన్ని చవిచూస్తున్న విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తెస్తూ అడ్మిషన్స్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) నివేదిక సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌లోని అన్ని కేటగిరీల విద్యార్థులూ ఒకే రకమైన(కామన్) ఫీజును చెల్లించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి చెప్పారు. మరో పది రోజుల్లో ఏఎఫ్‌ఆర్సీ నివేదిక ప్రభుత్వానికి చేరి.. ఆమోదం పొందితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట లభించనుందన్నారు. వివరాలు..

 

ఎంబీబీఎస్ అడ్మిషన్లలో ఏ, బీ, సీ కేటగిరీలు ఉన్నాయి. అంటే కన్వీనర్ కోటా, ‘బి’ కేటగిరీ, యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లో 50 శాతం కన్వీనర్ కోటా, 10 శాతం ‘బి’కేటగిరీ, 40 శాతం యాజమాన్యకోటా (ఇందులోనే 15 శాతం ఎన్‌ఆర్‌ఐ) ఉన్నాయి.

  ప్రస్తుతం కన్వీనర్ కోటా విద్యార్థులు ఏడాదికి రూ.60 వేలు, బీ కేటగిరీ విద్యార్థులు రూ.2.40 లక్షలు, యాజమాన్య కోటా విద్యార్థులు ఏడాదికి రూ.5.50 లక్షలు ఆయా కళాశాలలకు చెల్లిస్తున్నారు.

 

యాజమాన్య కోటా కింద చేరే విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.5.50 లక్షలే వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ ఐదేళ్లలో సుమారు రూ.70 నుంచి రూ.80 లక్షలు వసూలు చేస్తున్నారు. అదికూడా విద్యార్థుల్లో ప్రతిభ ఆధారంగా కాకుండా యాజమాన్యాలు తమకు నచ్చిన విధంగా సీట్లు కేటాయిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అన్ని కేటగిరీల వారికీ ఒకే రకమైన ఫీజు ఉండాలని, దీనివల్ల సీట్ల కొనుగోలు ఉండదని ఏఎఫ్‌ఆర్సీ భావిస్తోంది. దీనికిగాను గత కొన్ని రోజులుగా వివిధ ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల నుంచి నివేదికలు, అభిప్రాయాలు సేకరించింది.దీనిప్రకారం, అన్ని కేటగిరీల విద్యార్థులకు కామన్ ఫీజు కింద ఏడాదికి రూ.5 నుంచి 6 లక్షలు నిర్ణయించే అవకాశం ఉంది. అయితే, యాజమాన్యాలు మాత్రం కామన్ ఫీజును రూ 9 లక్షల కన్నా తక్కువగా నిర్ణయించరాదని కోరుతున్నట్టు సమాచారం.

 

‘కన్వీనర్ కోటా’ గుండెల్లో గుబులు



 కామన్ ఫీజు అనేసరికి కన్వీనర్ కోటా కింద సీట్లు పొందే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంచి ర్యాంకులు పొంది ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సాధించలేని వారు కన్వీనర్ కోటాకింద ఏడాదికి రూ. 60 వేల ఫీజులు చెల్లించి ప్రైవేటు కళాశాలల్లో చేరతారు. వీళ్లు కామన్ ఫీజు కింద రూ.5 లక్షలు చెల్లించడం సాధ్యం కాదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం రూ. 60 వేలు ఫీజు ఉంది కాబట్టి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. ఇక రూ.5 లక్షలైతే చెల్లించే పరిస్థితి ఉండదు. దీంతో ఈ కేటగిరీ కిందకు వచ్చే అభ్యర్థులు నష్టపోవాల్సి ఉంటుంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top