కమిటీలు @ తమ్ముళ్లు


సాక్షి, కడప : తొమ్మిదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో బాబు అందరికీ ఏదో ఒకటి చేయాలనుకున్నారో.... లేక ప్రతి పథకం తమవారి అధీనంలోనే ఉండాలని భావించారో తెలియదుగానీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రజలను విస్తుపోయేలా చేస్తున్నాయి. సంఘ సేవకుల ముసుగులో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను తీసుకొచ్చి పలు కమిటీల్లో కూర్చొబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఏ కమిటీలో అరుునా తెలుగు తమ్ముళ్లు ఉండాల్సిందే.



ప్రజాస్వామ్య బద్దంగా, చట్ట ప్రకారం... రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సైతం పక్కన పెట్టి కేవలం కొంతమంది అధికారులతోపాటు సేవకుల ముసుగులో తమ్ముళ్లను కమిటీల్లో చేర్చడం విశేషం. జన్మభూమి, పింఛన్ల తరహాలోనే రుణాలకు సంబంధించిన కమిటీల్లో కూడా తమ్ముళ్లకు చోటు కల్పించేందుకు సర్వం సిద్దం చేశారు.



వివరాల్లోకి వెళితే.... జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రుణాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఈనెల మొదటి వారం నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. షాపులతోపాటు ఫ్యాన్సీ స్టోర్స్, పశువుల, గొర్రెల యూనిట్లు, పలు మిషన్లకు సంబంధించి వాటితోపాటు అనేక రకాల స్వయం ఉపాధికి పలువురు జిల్లాలోని ఎస్సీ ఎస్టీలకు చెందిన నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరందరికీ డిసెంబరు 1 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది.



 మండల కమిటీలో తమ్ముళ్లకు అవకాశం

 జిల్లాలో ఎస్సీ ఎస్టీ రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను ఇంటర్వ్యూల అనంతరం కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదేశాల మేరకు కమిటీలను నియమిస్తారు. ఎంపీడీఓ కన్వీనర్‌గా, మండల సమాఖ్య అధ్యక్షురాలితోపాటు ముగ్గురు సంఘ సేవకులు, వెలుగు ఏపీఎంలు కమిటీలో ఉండనున్నారు.



ఇంటర్వ్యూలో బ్యాంకర్లు కూడా కూర్చొంటారు. సంఘ సేవకులంటే టీడీపీలో మండల స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే పలువురు చోటా నేతలను తీసుకొచ్చి సేవకులుగా కమిటీలో చేరుస్తున్నారు. అందుకు సంబంధించి రెండు రోజుల క్రితం జిల్లా నుంచి అన్ని ఎంపీడీఓ కార్యాలయాలకు కమిటీలలో అధికారికంగా సంఘ సేవకులు...అనధికారికంగా తమ్ముళ్లను చేర్చుకోవాలని ఆదేశాలు అందినట్లు సమాచారం.



 భగ్గుముంటున్న ప్రజాప్రతినిధులు

 ఎస్సీ ఎస్టీ రుణాలకు సంబంధించి వాటితోపాటు సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణాల విషయంలో కూడా కమిటీలలో సేవకుల ముసుగులో తమ్ముళ్లను చేరుస్తుండడంపై ప్రజాప్రతినిధులను భగ్గుమంటున్నారు. జన్మభూమి, పింఛన్ల పర్యవేక్షణ కమిటీలలో కనీసం కొంతైనా ప్రజాప్రతినిధులకు గౌరవాన్ని కల్పించారు. సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీలను కమిటీ సమావేశాల్లో ప్రాధాన్యం కల్పించారు.



అయితే ఎస్సీ ఎస్టీరుణాలకు సంబంధించి ఎంపిక కమిటీలో ప్రజాప్రతినిధులు గల్లంతు కావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ,ఎంపీపీ లాంటి ప్రజాప్రతినిధులు ప్రజల ఆదరణతో గెలుపొందినా.....మండల స్థాయిలో లబ్దిదారుల రుణాల కమిటీ విషయంలో వింత ధోరణి పాటించడంపై సర్వత్రా ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా కమిటీల విషయంలో పారదర్శకత పాటించకపోవడంపై పలువురు పెదవి విరిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top