పింఛన్లు పెంచారోచ్..!


నియోజకవర్గానికి వెయ్యి వంతున జిల్లాకు 9 వేలు మంజూరు

 జన్మభూమి కమిటీ సూచించిన వారికే

 అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల అమలు

 

 విజయనగరం అర్బన్: అర్హతలున్నా సాంకేతిక కారణాలతో పింఛను అందక కొంత కాలంగా నిరీక్షిస్తున్న కొందరు లబ్ధిదారులకు ఊరట లభించనుంది. ఎన్‌టీఆర్ భరోసా పథకం ద్వారా జిల్లాకు మరో 9 వేల పింఛన్లు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి వెయ్యి పింఛన్లు చొపున వీటిని కేటాయించారు. దీంతో  అయితే పింఛను దరఖాస్తులను జన్మభూమి కమిటీలు పరిశీలించి తుది జాబితాను రూపొందించి అందించాల్సి ఉంది. అన్నీ సక్రమంగా జరిగితే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త పింఛన్లను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2.40 లక్షల మందికి ఇస్తున్నారు.

 

 ఇందులో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, కల్లు గీత కార్మికులు ఉన్నారు. కొత్తగా మంజూరైన 9 వేల పింఛన్లతో కలిపి 2.49 లక్షలకు చేరనుంది. అయితే గత ప్రభుత్వం హయంలో 2.79 లక్షల మందికి పింఛన్ ఇచ్చేవారు. ఈ లెక్కన  పింఛన్ రద్దు చేసిన వారి సంఖ్య ఇంకా 30 వేలు దాటే ఉంది.  ఇప్పటికే పింఛన్ కోరుతూ మరో 35 వేల దరఖాస్తులు అందగా వాటిలో సుమారు 25 వేల మందిని అర్హులుగా తేల్చారు. వాటిని మరోసారి పరిశీలించి అందులో ప్రాధాన్యం ప్రకారం అర్హత ఉన్న వారికి  మంజూరు చేయడంతోపాటు, మిగిలిన వాటికి నూతన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎంపిక ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారం ముగిసేలోపు పూర్తి చేసేందుకు కసరత్తు జరుగు తోంది.

 

 జన్మభూమి కమిటీ సూచించిన వారికే

 ప్రస్తుతం విడుదల చేసిన నియోజకవర్గానికి వెయ్యి పింఛన్లలో మండలానికి సరాసరిన కనీసం 200 మించి దక్కే అవకాశం లేదు. గ్రామాలకు 5 నుంచి 10 మాత్రమే కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు రూపొందించే జాబితా ప్రాధాన్యం సంతరించుకోనుంది. అయితే ఇటీవల పంచాయతీ కార్యదర్శుల బదిలీలు భారీగా జరగడంతో, అన్ని గ్రామ పంచాయతీల్లోనూ నూతన కార్యదర్శులే ఉన్నారు. దీంతో వారి కంటే జన్మభూమి కమిటీ సభ్యులు సూచించిన వారికే పింఛను దక్కనుంది. లబ్ధిదారుడి వయస్సుతోపాటు, నిరుపేదలు, వితంతువులు, వికలాంగులు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోనున్నారు.

 

 పెరగనున్న  ఒత్తిళ్లు

  పింఛను సాయం కోసం నిరీక్షిస్తున్న వారు ప్రతి పంచాయతీలోను వందల సంఖ్యలో ఉండడంతో ఆధిక సంఖ్యలో పోటీ పడి రాజకీయఒత్తిళ్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. దీంతో విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తున్న పింఛన్లను ప్రాధాన్య క్రమంలో అందేలా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులపై ఉంది. వారు రూపొందించిన జాబితాను అనంతరం గ్రామ, మండల స్థాయి జన్మభూమి కమిటీలు అనుమతిస్తే ఎంపీడీఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం డీఆర్‌డీఏలోని పింఛన్ల విభాగం అధికారులు  మరోమారు పరిశీలించి సెర్ప్ కార్యాలయానికి నివేదిస్తారు.

 

 అక్టోబర్ నుంచి  కొత్త పింఛన్ల అమలు: డీఆర్‌డీఏ పీడీ

 జిల్లాకు 9 వేల  నూతన పింఛన్లు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కేటాయించనున్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారం ముగిసేలోపు పూర్తిచేయనున్నాం. అక్టోబరు 1వ తేదీ నుంచి నూతన పింఛన్లు మంజూరుకానున్నాయని డీఆర్‌డీఏ పీడీ డిల్లీరావు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top