కమిషనర్ తీరుపై కన్నెర్ర


ఒంగోలు:  నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహారం ప్రజాప్రతినిధులకు సైతం అసహనం తెప్పించింది. సోమవారం విద్యుత్ స్తంభంపై నుంచి పడి చనిపోయిన వెంకటేశ్వర్లు బంధువులు, గ్రామస్తులు ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా ... శాంతింపజేయాల్సింది పోయి కమిషనర్ సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి ఎక్కడున్నారో తెలియనీయకుండా తప్పించుకోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మొదలు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ వరకు కమిషనర్‌కు ఫోన్లు చేస్తున్నా నో రెస్పాన్స్. దీంతో  కలెక్టర్‌కు ఫోన్‌చేసి  బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించడంతో కలెక్టర్ జోక్యం చేసుకోవల్సి వచ్చింది.



వివరాలు ఇలా ఉన్నాయి...

 ముక్తినూతలపాడు పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్‌గా అదే గ్రామానికి చెందిన సూదనగుంట వెంకటేశ్వర్లు(32)  సోమవారం కరెంట్ పోల్ ఎక్కి విద్యుత్ బల్బులు అమర్చుతూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషయం విదితమే. వెంకటేశ్వర్లు కుటుంబానికి న్యాయం చేయాలంటూ  గ్రామస్తులు, బంధువులు మంగళవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ ఆవరణలోనే మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ నాయకులు కలుగజేసుకొని రూ.15 లక్షల పరిహారం, మృతుని భార్యకు ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.



మంత్రి శిద్దా రాఘవరావుకు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌కు ఫోన్‌చేసి కమిషనర్ మొండి వైఖరిని వివరించారు. మరో వైపు వైఎస్సార్‌ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా జోక్యం చేసుకొని  ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి వివరించారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి నేరుగా కలెక్టర్‌తో మాట్లాడారు. మరో వైపు మంత్రితోపాటు ఎమ్మెల్యే కూడా కమిషనర్‌తో మాట్లాడేందుకు యత్నించగా ఆమె ఎక్కడున్నారో తెలియరాలేదు . కనీసం ఫోన్లు కూడా పని చేయకపోవడంతో కలెక్టర్‌తో మాట్లాడాల్సి వచ్చింది.



 క్యాంపులో ఉన్న జిల్లా ఉప కార్మికశాఖ అధికారి అఖిల్ విషయం తెలుసుకొని కార్మికశాఖ తరుపున తప్పక న్యాయం జరిగేలా చూస్తానంటూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రమాదేవి ద్వారా ఆందోళన చేస్తున్నవారికి తెలియజేశారు.  ఆ హామీతో సంతృప్తి చెందని ఆందోళనకారులు చర్చిసెంటర్‌లో రోడ్డుపై బైఠాయించారు. పరారైన కమిషనర్‌ను పిలిపించాలంటూ ఆగ్రహించారు.  ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ అక్కడకు చేరుకొని కలెక్టర్‌తో చర్చించడానికి రావాలంటూ కొంతమందిని పంపించారు.



 కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై తప్పకుండా కమిషనర్‌నుంచి వివరణ కోరతానని కలెక్టర్ విజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. మృతుని భార్యకు ప్రభుత్వ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తానని...పర్మినెంట్ చేసే అవకాశాలు  పరిశీలిస్తానన్నారు. వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్టు, పీఎఫ్ ఇతరత్రా మొత్తం న్యాయబద్ధంగా ఎంత రావాలో అంత మొత్తాన్ని త్వరితగతిన ఇప్పిస్తామంటూ కలెక్టర్ వివరించడంతో  శాంతించి మృతదేహాన్ని చర్చిసెంటర్‌నుంచి తీసుకొని వెళ్లారు.



 మున్సిపల్ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం...

 వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్ కాదని,  హెల్పర్‌గా మాత్రమే తీసుకున్నట్లు మున్సిపల్ డీఈ గోపాల్ కలెక్టర్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ ఆగ్రహించారు. నాన్ టెక్నికల్ కింద ఉద్యోగం ఇచ్చి టెక్నికల్ పనులు ఎందుకు చేయించుకుంటున్నారు...అతనిని ఏ విభాగం కింద తీసుకున్నారో  రిపోర్టు పంపండంటూ మండిపడ్డారు.   ఆరుగంటలపాటు అందుబాటులోకి రాని కమిషనర్ చర్చలు ముగిశాయని తెలుసుకొని రాత్రి 8 గంటల తరువాత ప్రత్యక్షమయ్యారు. చీమకుర్తికి వెళ్లడంతో ఫోన్ స్విచాఫ్ అయిందని చెప్పడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top