త్వరలో కలెక్టర్ల బదిలీలు!

త్వరలో కలెక్టర్ల బదిలీలు!


- ‘ఎస్ సార్’ అనేవారికే పోస్టింగులు

- మాటవినని వారికి అప్రధాన పోస్టులు


 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. అధికార పక్షం నేతలు చెప్పిన అడ్డగోలు పనులు చేసేందుకు వీలుకాదంటున్న వారిని తప్పించేందుకు కసరత్తు సాగుతోంది. తాము ఏమి చెప్పినా ‘ఎస్ సార్’ అనే వారిని జిల్లా మెజిస్ట్రేట్లుగా తెచ్చుకోవాలని కొందరు మంత్రులు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. చెప్పిన మాట చెప్పినట్లు చేయకుండా నిబంధనలు అంగీకరించవని చెప్పే వారిని తప్పించి అప్రధాన పోస్టులకు పంపించాలని మంత్రులు ఒత్తిడి తెస్తున్నారు. తాము చెప్పినట్లు చేయలేదనే కక్షతో కలెక్టర్లను తప్పించేందుకు తప్పుడు ఫిర్యాదులు కూడా చేయిస్తున్నారు.

 

  కోస్తా జిల్లాల్లో కూడా ఇద్దరు కలెక్టర్లపై ఇలాగే బురదచల్లి బదిలీ చేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ‘టీడీపీ వారు చెప్పిన పనులు చేయాల్సిందే. అధికారంలోకి తెచ్చిన వారికి మేలు చేయడం కుదరదంటే ఎలా? రూల్స్ మాట్లాడవద్దు... మావారు (అధికార పక్షం నేతలు) చేసిన సిఫార్సుల అమలు చేయండి. ఈ విషయంలో  ఇక నాకు ఫిర్యాదులు రాకూడదు..’ అని కీలక నేత కొంతకాలం కిందట నేరుగా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మీరు చెప్పిన తర్వాత కూడా మాట వినడంలేదు. వారిని మార్చండని తాజాగా కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 

 ఆయన బదిలీపైనే ప్రధాన చర్చ...

 గతంలో ఐఏఎస్‌ల బదిలీల సందర్భంగా రాయలసీమలో ఒక జిల్లా కలెక్టర్ కచ్చితంగా బదిలీ అవుతారని ఆ జిల్లా ఉద్యోగులు, అధికారులు దృఢంగా విశ్వసించారు. ‘కలెక్టరు వేధింపులు భరించలేకపోతున్నాం. జిల్లా స్థాయి అధికారులను సైతం నిత్యం వేధిస్తున్నారు. భారీ అవినీతికి పాల్పడుతున్నారు. ఆయన దోచుకుంటూ మాపై అవినీతి ముద్ర వేస్తున్నారు...’ అంటూ సదరు అధికారి అక్రమార్జనపై వివరాలతో ప్రభుత్వానికి ఆకాశరామన్న ఉత్తరాలు కూడా పంపించారు. కొందరు అధికార పక్ష ప్రజాప్రతినిధులు కూడా ఆయనను బదిలీ చేయాలని కోరారు. కలెక్టరు బదిలీ అయితే పొట్టేళ్లు బలి ఇస్తామని, కొబ్బరికాయలు కొడతామని చాలామంది అధికారులు మొక్కుకున్నట్లు అధికారవర్గాల్లో రసవత్తరమైన చర్చ సాగింది.



ఆ జిల్లా కలెక్టర్ కచ్చితంగా బదిలీ అవుతారని సచివాలయంలోనూ ప్రచారం సాగింది. అయితే సదరు కలెక్టర్ బదిలీ కాలేదు. ఈ పర్యాయం ఆయన బదిలీ తప్పకపోవచ్చని అధికాారులు చెబుతున్నారు కానీ... ‘ఆ కలెక్టర్ బదిలీ కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఎవరి మాటా వినని విషయం వాస్తవమే. అయితే సీఎం కాలితో చెబితే చేతితో చేస్తారు. అందువల్లే సీఎం ఆయనను బదిలీ చేయకపోవచ్చు’ అని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేసి ఉత్తరాంధ్ర జిల్లాకు కలెక్టరుగా వెళ్లిన ఓ అధికారికి ముక్కుసూటి మనిషనే గుర్తింపు ఉంది. అన్నివిధాలా అవినీతికి పాకులాడే ఆ జిల్లా మంత్రికి ఆ కలెక్టర్ నచ్చడంలేదు.

 

 కలెక్టరును మార్చితేనే కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గుకు రాగలమని అధికారపార్టీ నేతల ద్వారా కూడా మంత్రి సీఎంకు చెప్పిస్తున్నారని సమాచారం. రాయలసీమలో కరువుతో పంటలు ఎండిపోవడాన్ని సకాలంలో తన దృష్టికి తీసుకురాలేదనే తప్పుడు ఆరోపణలతో మరో కలెక్టర్‌ను మార్చాలని ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. అసలు విషయం ఏంటంటే పాలకపక్ష నాయకులు అడ్డగోలుగా కాంట్రాక్టులు అడుగుతుండంతో ఆ కలెక్టర్ అంగీకరించడంలేదనేది సమాచారం. కోస్తాలో ఇటీవలే పోస్టింగు లభించిన మరో కలెక్టర్‌ను కూడా మార్చాలని నాయకులు కోరుతున్నారని తెలిసింది.

 

 మున్సిపల్ ఎన్నికల తోనూ లింకు...

 త్వరలో జరగనున్న నగరపాలక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలంటే ఫలానా అధికారులను బదిలీ చేయాలని ఇటీవల కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విన్నవించారు. రకరకాల సాకులతో ఇప్పటివరకూ ఎన్నికలు జరపకుండా తప్పించుకుంటూ వచ్చిన సర్కారు హైకోర్టు ఆదేశాల మేరకు ఈఏడాది చివర్లో ఎన్నికలు జరపక తప్పదని నిర్ణయించుకుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కర్నూలు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, ఒంగోలు నగర పాలక సంస్థలు, రాజంపేట, రాజాం, కందుకూరు, నెల్లిమర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాల్సి ఉంది.

 

 ఈ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని, ఇందుకు కావాల్సిన సాధనాసంపత్తులన్నీ తానే సమకూర్చుతానని ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వీటిలో గెలవాలంటే మాట వినని కలెక్టర్లను బదిలీచేసి అనుకూలమైన వారిని వేయాలని మూడు జిల్లాల నేతలు కోరారు. త్వరలోనే కలెక్టర్లను బదిలీ చేస్తామని, మన మాట వినే వారే వస్తారని ముఖ్యమంత్రి చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో త్వరలో  కలెక్టర్ల బదిలీలు ఉంటాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top