ఏపీపైనే నీతూ ప్రీతి!

ఏపీపైనే నీతూ ప్రీతి! - Sakshi


 సాక్షి, కాకినాడ :ఐఏఎస్‌ల పంపకంలో తెలంగాణ కు కేటాయించిన జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్  ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగాలని భావిస్తున్నారు. ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఇటీవల ఆమె భర్త రాజేష్‌కుమార్ గుంటూరు అర్బన్ ఎస్పీగా వెళ్లారు. దాంతో తాను కూడా ఆంధ్రలోనే కొనసాగేందుకు వీలుగా స్పౌజ్ ఆప్షన్ (దంపతులైన అధికారులు ఒకేచోట పని చేసే వెసులుబాటు) పెట్టుకున్నట్టు తెలుస్తోంది.నీతూప్రసాద్ 2012 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమె భర్త రాజేష్‌కుమార్ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియిన్ కమాండెంట్ గా బదిలీపై వచ్చారు. తొలుత ఇరువురూ తెలంగాణ  రాష్ట్రానికి వెళ్లిపోవాలన్న భావించారు. ఈ క్రమంలోనే  కలెక్టర్ తెలంగాణ  ఆప్షన్ పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ఐఏఎస్ కేటాయింపుల్లో ఆమెను ఆ రాష్ట్రానికే కేటాయించారు.

 

 కానీ ఇంతలో రాజేష్‌కుమార్‌ను గత నెల 16న ప్రభుత్వం గుంటూరు అర్బన్ ఎస్పీగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు లూప్‌లైన్ లాంటి ఏపీఎస్పీలో ఉన్న రాజేష్‌కుమార్ ఇప్పుడు అర్బన్ ఎస్పీగా మెయిన్‌లైన్ లాంటి విభాగానికి బదిలీ కావడంతో ఆంధ్రాలోనే ఉండాలని కోరుకుంటున్నట్టు సమాచారం. పైగా విజయవాడ-గుంటూరుల మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా బదిలీ కావడంతో కీలక పోస్టు దక్కిందన్న భావనతో ఆయన తెలంగాణ కు వెళదామా, వద్దా అన్న మీమాంసలో పడ్డట్టు కనిపిస్తోంది. ఐఏఎస్‌ల కేటాయింపులో భార్య నీతూప్రసాద్‌ను తెలంగాణ కు కేటాయించినందున తాను అక్కడకు వెళితే ఇంతకంటే కీలకమైన పోస్టు దక్కుతుందో లేదోనని సంశయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఎక్కడ ఉంటే పదోన్నతులు త్వరగా వస్తాయో ఇరురాష్ట్రాల్లోని తన మిత్రులతో చర్చిస్తున్నట్టు సమాచారం.

 

 జిల్లాలో కాకుంటే కృష్ణా, గుంటూరులకు?

 ఆధార్ సీడింగ్‌లో తూర్పును అగ్రగామిగా నిలిపిన కలెక్టర్ నీతూప్రసాద్‌ని ఆంధ్రాలోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. జన-ధన యోజనను ప్రారంభించేందుకు గురువారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్‌ను ప్రశంసిం చడం గమనార్హం.  గోదావరి పుష్కరాల వరకు ఆమెనే కొనసాగించాలని జిల్లాలోని కీలకమంత్రి కూడా పట్టుదలతో ఉన్నారు. మరో పదినెలల్లో పుష్కరాలు రానున్న తరుణంలో కొత్త కలెక్టర్ వస్తే ఇక్కడి వాతావరణానికి సర్దుబాటు అయేందుకు కొంత సమయం పడుతుందని, ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుందన్న భావనతోనే నీతూ ప్రసాద్‌నే పుష్కరాలయ్యే వరకు కొనసాగించాలని ఆ మంత్రి భావిస్తున్నారు. అంతేకాక.. ఆమె ఎన్నికల్లోనూ, ఆ తర్వాత కూడా ఆయన మాట జవదాటకుండా వ్యవహరిస్తుండడమూ ఇందుకు కారణం అంటున్నారు. జిల్లా పర్యటనలో ఇదే విషయాన్ని ఆయన ముఖ్యమంత్రికి చెప్పగా, కలెక్టర్ పనితీరు పట్ల సంతృప్తితో ఉన్న సీఎం కూడా ఆమెను రాష్ర్టంలోనే కొనసాగాలని కోరినట్టు తెలిసింది. ఒకవేళ జిల్లాలో కొనసాగకుంటే ఆమె భర్త పనిచేస్తున్న గుంటూరు లేదా కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పంపిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.

 

 ఏపీలోనే కొనసాగనున్న దంపతులు!

 జిల్లా మంత్రితో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ  వెళ్లే విషయమై కలెక్టర్ పునరాలోచనలో పడ్డారని, రాష్ర్టంలోనే కొనసాగితే టీడీపీ సర్కార్‌లో కీలక అధికారిగా గుర్తింపు పొందే అవకాశం ఉండడంతో ఇదే విషయమై భర్తతో చర్చించి రాష్ర్టంలోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను ఏపీలోనే కొనసాగాలనుకుంటున్నట్టు స్పౌజ్ ఆప్షన్ ద్వారా కేంద్రానికి తెలిపినట్టు సమాచారం. అయితే ఆమె పుష్కరాల వరకు జిల్లాలోనే కొనసాగుతారా, లేక భర్త పనిచేస్తున్న గుంటూరు లేదా పక్కనే ఉన్న కృష్ణా జిల్లాల బదిలీకి మొగ్గు చూపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై కలెక్టర్ నీతూప్రసాద్‌ను వివరణ కోరగా ఇది తమ పర్సనల్ విషయమంటూ స్పౌజ్ ఆప్షన్ విషయాన్ని తెలియజేసేందుకు నిరాకరించారు.

 

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top