భావోద్వేగాలకు గురికావద్దు


కోసిగి రూరల్ : రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులు జరగకుండా చూస్తామని కలెక్టర్ విజయమోహన్ పేర్కొన్నారు. ఇరు ప్రాంతాల రైతులు భావోద్వేగాలకు గురికాకుండా సహనం పాటించాలని సూచించారు.  ఆధునికీకరణ పనులను తిరిగి ప్రారంభిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంతో మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆర్డీఎస్‌ను పరిశీలించారు.



 అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆధునికీకరణ పనుల్లో ఆనకట్ట ఎత్తు పెంచడం లేదన్నారు. అలా పెంచాల్సి వస్తే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని అన్నారు. తన పరిశీలనలో రైతులు, అధికారులు తెలిపిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తామని చెప్పారు.



 సీమ రైతులకు అన్యాయం చేయవద్దు..

 ఆర్డీఎస్ ఆనకట్టు ఎత్తును పెంచి రాయలసీమ రైతులు, ప్రజలకు ఎలాంటి అన్యాయం చేయవద్దని కలెక్టర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బెట్టనగౌడ్, భీంరెడ్డి, మురళీరెడ్డి కోరారు. ఎత్తు పెంచితే దిగువ ప్రాంతానికి 1500 క్యూసెక్కుల నీటి సరఫరా తగ్గిపోతుందని, అలాగే ఎగువ ప్రాంతంలో 200 ఎకరాలు ముంపునకు గురవుతాయన్నారు.



 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా ఆర్డీఎస్ ఎత్తును పెంచుకోవడానికి నిజాం పాలకులు వీలు కల్పించినట్లు కలెక్టర్‌కు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి వివరిస్తుండగా సీమ రైతులు అడ్డుకున్నారు. సీమ ప్రాంత రైతులకు నీటి కష్టాలు వచ్చేలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.



 సాగు, తాగునీటి వసతి కల్పించాలి

 తుంగభద్ర నది నుంచి సీమ ప్రాంత వాసులకు తాగు, సాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోసిగి మండల రైతులు కలెక్టర్  విజయమోహన్‌ను కోరారు. చాలా కాలంగా ఆర్డీఎస్ నుంచి దాగువకు రావాల్సిన నీటి వాటా రాకపోవడంతో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్ కాన్వాయ్‌ని అడ్డుకుని చుట్టుముట్టారు. ఎలాంటి సమస్య రాకుండా చూస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు శాంతించి వెనుదిరిగారు.



 కలెక్టర్ వెంట ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, కోసిగి సీఐ అస్రార్‌బాషా, కోసిగి, పెద్దకడుబూరు మండలాల ఎస్‌ఐలు కృష్ణమూర్తి, జగన్ మోహన్ యాదవ్ ఉన్నారు.  రైతుల ఆందోళనకు కోసిగి వైఎస్సార్‌సీపీ నాయకులు మంగమ్మ, నాడుగేని నరసింహులు, హోళగుంద కోసిగయ్య, లచ్చప గోవిందు, బండల గోవిందు, ఆకాశ్‌రెడ్డి, దొడ్డి నరసన్న  తదితరులు మద్దతు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top