తీరంలో ‘తమ్ముళ్ల’ ఇష్టారాజ్యం

తీరంలో ‘తమ్ముళ్ల’ ఇష్టారాజ్యం


 సాక్షి ప్రతినిధి, కాకినాడ :అధికార పార్టీ నేతల్ని... అందునా ప్రజాప్రతినిధుల్ని ప్రసన్నం చేసుకుంటే ఏదీ అసాధ్యం కాదని పదేపదే రుజువవుతోంది. తీర ప్రాంతంలోని రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలే (హేచరీస్) అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. సముద్రం నుంచి 500 మీటర్ల వరకు కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్‌జెడ్) పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలు జరపాలలన్నా సీఆర్‌జెడ్ అధికారుల అనుమతుల పొందాలి. దీంతో పాటు హేచరీస్ ఏర్పాటుకు కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతులు తీసుకోవాలి. కానీ  కాకినాడ నుంచి అద్దరిపేట వరకు విస్తరించిన సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా హేచరీస్ నిర్మించి ఏటా రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు. 80 వరకు హేచరీస్ ఏర్పాటు కాగా కేవలం పదింటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి.

 

 పోలీసుల ముందరి కాళ్లకు బంధాలు

 ఈ ప్రాంతంలో హేచరీల దందా ఓ మాఫియాలా సాగుతోంది. తెలుగుతమ్ముళ్లు అక్రమ హేచరీలకు ప్రోత్సాహమిస్తూ ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.ఐదు లక్షలన దండుకుంటున్నారు. ఇటీవల ఇలా రూ.నాలుగు కోట్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం. హేచరీల్లో ఎక్కువ వాటికి అనుమతులు లేవని తెలిసినా అటు మత్స్యశాఖ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీసులు కానీ పట్టించుకోక పోవడం విశేషం. అధికార పార్టీ వారు తమ ఆగడాలను అడ్డుకునే వారిపై భౌతిక దాడులకు సైతం బరితెగిస్తున్నారు.  కాకినాడకు చెందిన ఒక హేచరీపై టీడీపీ కీలక నేత అనుచరులు శుక్రవారం దాడిచేసి రూ.30 లక్షల విలువ చేసే ఆస్తిని ధ్వంసం చేశారు. దీనంతటి వెనుక టీడీపీ పెద్ద నేతలు అండ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో పోలీసులను జోక్యం చేసుకోకూడదని నేతలే చెబుతున్నారని తెలుస్తోంది. ఇక్కడ సాగుతున్న దందాను కొందరు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం.  

 

 తెలుగు తమ్ముళ్ల దందా..

 సముద్ర తీర ప్రాంతంలో వ్యాపారం చేయాలంటే ఒక ప్రముఖ అధికార పార్టీ నేతకు ముడుపులు సమర్పించుకోవాల్సిందే. ఎవరైనా కాదంటే హేచరీస్ పైకి ఉసిగొల్పుతున్నారు. ఇందుకు ఉదాహరణ శుక్రవారం జరిగిన సంఘటన. కాకినాడకు చెందిన మౌళి దానవాయి పేట పంచాయితీ పరిధిలో ప్రియాంక హేచరీని నడుపుతున్నారు. దీనికి అన్ని అనుమతులూ ఉన్నాయి. అయితే ఆయన అధికార పార్టీ దందా నేత అడిగినంతా ఇవ్వనందున కత్తి కట్టారు. దీనికి తోడు ఈ నెల 22న కేంద్ర, రాష్ట్రానికి చెందిన ప్రత్యేక బృందాలు హేచరీల తనిఖీలకు  వస్తున్నారు. దీంతో అనుమతులు లేని హేచరీతపై మౌళే ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడి ప్రోద్బలంతో అధికార పార్టీకి చెందిన కీలక ప్రతినిధి అనుచరులు మౌళి హేచరీపై దాడి చేసి ధ్వంసం చేశారు. ‘కిట్టయ్యతో పెట్టుకుంటే నీ అంతు చూస్తామని ఫోన్లో బెదిరించారని’ మౌళి వాపోయారు. తనకు జరిగిన అన్యాయం పై పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేదన్నారు.

 

 పుట్టగొడుగుల్లా హేచరీలు..

 గతంలో టైగర్ రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే హేచరీలు పదుల సంఖ్యలోనే ఉండేవి. రెండేళ్లుగా వనామీ రొయ్యల సాగు లాభదాయకంగా మారడంతో సీడ్‌కు డిమాండ్ ఏర్పడింది. దీంతో వ్యాపారులు ఆ రొయ్య పిల్లల హేచరీస్‌పై దృష్టి సారించారు. నిబంధనలను గాలికి వదిలి హేచరీ నిర్మాణాలు చేపట్టారు. ఈ ఒక్క ఏడాదిలోనే 30కి పైగా కొత్త హేచరీలు వచ్చాయి. హెదరాబాద్, కృష్ణా, విశాఖపట్నం, చెన్నై, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి బడా వ్యాపారులు స్థానికులతో కలసి హేచరీలు నిర్మించారు. వీటిలో చాలా వాటికి పంచాయతీ అనుమతులు తప్ప సీఆర్‌జెడ్, సీఏఏ అనుమతులు లేవు.

 సముద్ర జలాలు కలుషితం..

 తీర ప్రాంతంలో హేచరీల ఏర్పాటు వలన సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. తీరానికి ఆనుకుని హేచరీలు నిర్మించి, పైపులైన్ల ద్వారా ఉప్పునీటిని ఆక్వా కల్చర్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. అలాగే వినియోగించిన వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి వదులు తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారుల కంటికి కనిపించడం లేదు. కారణం.. అధికార  మదంతో పేట్రేగుతున్న కొందరు టీడీపీ నేతల ధాష్టీకమే.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top