రాజధాని డిజైన్లకు సీఎం మళ్లీ సూచనలు

రాజధాని డిజైన్లకు సీఎం మళ్లీ సూచనలు - Sakshi


- రెండు వారాల్లో ఇస్తామన్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ    

- హైకోర్టు భవనాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలని సూచన

- పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్, దక్షిణం వైపు అంబేడ్కర్‌ విగ్రహాలు

- రెండింటి మధ్యలో భారీ టవర్‌ ..న్యాయ నగరం పక్కనే మరో నగరం




సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం తుది డిజైన్లు ఇంకా ఖరారు కాలేదు. లండన్‌ ఆర్కిటెక్ట్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మార్చి ఇచ్చిన డిజైన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరిన్ని మార్పులు సూచించారు. అందుకు రెండు వారాల సమయం కావాలని, అప్పుడు తుది డిజైన్లు ఇస్తామని ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు కోరారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రాజధాని డిజైన్లను ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో సోమవారం ఆయనకు చూపించారు. మూడు రకాల డిజైన్లను వారు చూపించగా.. వాటికి ఇంకా హంగులు కావాలని సీఎం సూచించారు. తాజా డిజైన్లో చూపించిన హైకోర్టు భవనం అంతగా ఆకట్టుకోవడంలేదని దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలని కోరారు.



పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్‌ విగ్రహం, దక్షిణం వైపు అంబేద్కర్‌ విగ్రహం ఉండేలా డిజైన్లు మార్చాలని సూచించారు. ఈ రెండింటి మధ్యలో అమరావతి నగరమంతా కనపడేలా అత్యంత ఎత్తయిన టవర్‌ నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సచివాలయం, హెచ్‌ఓడీల కార్యాలయాలు పక్కపక్కనే ఉండాలని చెప్పారు. వాటికి ఎదురుగా నివాస సముదాయాలు రావాలన్నారు. శాసనసభ, శాసనమండలికి మధ్యలో సెంట్రల్‌ హాలు ఉండాలని సూచించారు. నగరానికి రెండు వైపులా అతి పెద్ద పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు బీఆర్టీఎస్, ఎంఆర్‌టీఎస్‌ బస్‌ బేల గురించి వివరించారు.



ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు ఎలా ఉండాలనే దానిపై చర్చించారు. రాజ్‌భవన్‌ సమీపంలోనే ముఖ్యమంత్రి నివాసం ఉంటుందని ఫోస్టర్‌ సంస్థ తెలిపింది. ఈ మార్పులన్నీ చేయడానికి తగిన సమయం కావాలని ఫోస్టర్‌ ప్రతినిధులు కోరారు. తొలుత వెలగపూడి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులకు ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు ఈ డిజైన్లు చూపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పోలవరం పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఉండవల్లిలో ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్లను ప్రదర్శించారు. ఈ సమావేశాల్లో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top