బిజీ బిజీగా..

బిజీ బిజీగా.. - Sakshi


* విజయవాడలో పోలీసు శాఖ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం

* ఐజీఎంసీ స్టేడియంలో అమరవీరులకు నివాళి

* ‘శోధన’‘ వాహనానికి పచ్చజెండా

* క్యాపిటల్ పోలీసు కంట్రోల్ రూమ్ ప్రారంభం


సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో పాల్గొని స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పలు ప్రారంభోత్సవాలు, ప్రైవేట్ కార్యక్రమాలతోపాటు గన్నవరంలో జరిగిన రైతు సాధికార సంస్థ ప్రారంభ సభలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు బిజీబిజీగా సీఎం పర్యటన  సాగింది. ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలు హుదూద్ బాధితుల కోసం భారీగా విరాళాలు ముఖ్యమంత్రికి అందజేశారు.

 

పోలీసు సంక్షేమ నిధికి రూ. 10 కోట్లు

ఉదయం 7.30 గంటలకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి  ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ వచ్చారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు  స్వాగతం పలికారు. అక్కడ్నుంచి  నేరుగా విజయవాడ చేరుకున్నారు. ఉదయం 8.10 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు.



గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రిలకు చెందిన ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది పరేడ్ నిర్వహించారు. అనంతరం  పోలీసు శాఖ రూపొందించిన పుస్తకాలను బాబు అవిష్కరించారు. అనంతరం అమరవీరుల సేవలను కొనియాడుతూ  మాట్లాడారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి విజయవాడ వేదిక కావడం మంచి పరిణామమని, పోలీసు సంక్షేమ నిధికి కార్పస్ ఫండ్‌గా రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.  



రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడుతోపాటు పోలీస్ శాఖలో వివిధ విభాగాల డీజీలు సురేంద్రబాబు, అనూరాధ, గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రతినిధి కూడా హాజరయ్యారు.  పలువురు వ్యాపారులు హుదూద్ బాధితుల కోసం సీఎంకు విరాళాలు అందజేశారు. ఆ తర్వాత శోధన పేరుతో విజయవాడ నగర కమిషనరేట్ పోలీసులు రూపొందించిన ప్రత్యేక వాహనాన్ని ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.



బస్టాండ్ సమీపంలో క్యాపిటల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు కంట్రోల్ రూమ్‌లోని ప్రత్యేకతలు, అందిస్తున్న సేవల్ని చంద్రబాబుకు వివరించారు. అక్కడ్నుంచి చుట్టుగుంట సెంటర్‌కు చేరుకుని  తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నేత నాగుల్‌మీరా నివాసానికి వెళ్లారు. అనంతరం గన్నవరం బయలుదేరారు.

 

రైతు సాధికార సంస్థ ప్రారంభం

ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి గన్నవరంలోని పశువైద్యక్షేత్ర సముదాయానికి  చేరుకుని రైతు సాధికార సంస్థను ప్రారంభించారు.  వ్యవసాయ శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. ఆ తర్వాత జరిగిన సభకు వ్యవసాయ శాఖ మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షత వహించారు. అక్కడ పలువురు తుపాను బాధితుల కోసం విరాళాలు అందజేశారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకుని తూర్పుగోదావరి జిల్లాకు పయనమయ్యారు.



ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చిన్నరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీలు సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ , కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, కేశినేని నాని, గోకరాజు గంగరాజు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ,  కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, నగర పోలీస్ కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌రావు, వలభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, నగర మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణ, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవనరావు, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top