డ్వాక్రా రుణమాఫీ తూచ్..

డ్వాక్రా రుణమాఫీ తూచ్.. - Sakshi


- రుణం మొత్తం మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ

- గెలిచాక మాటమార్చిన వైనం

- ఒక్కో సభ్యురాలికి రూ.10 వేలు చెల్లిస్తామని వెల్లడి

- తాజాగా రూ.3 వేలు చొప్పున మూడు విడతలుగా చెల్లిస్తామని ప్రకటన

- దానినీ డ్రా చేసేందుకు వీల్లేదు

- మెప్మా పరిధిలోనూ అంతే..

- మహిళల చేతికి ఒక్క రూపాయి రాదు

- ఇదీ బాబు గారి మాఫీ పురాణం!


‘డ్వాక్రా మహిళల కన్నీళ్లు తుడుస్తా. పాదయాత్రలో అక్కచెల్లెళ్ల కష్టాలు కళ్లారా చూశాను. వారి కష్టాలు తీర్చేందుకు ఇంటికి పెద్ద కొడుకునవుతా. డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలన్నీ తీరుస్తా’ ఇదీ గత ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ. అధికారం చేపట్టిన అనంతరం డ్వాక్రా సంఘాల రుణమాఫీపై తూచ్.. అంటూ వెనుకంజ వేశారు. డ్వాక్రా రుణం మొత్తం రద్దు చేయబోమని, ఒక్కొక్క సభ్యురాలికి రూ.10 వేలు చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఇప్పడేమో మూడు వాయిదాల్లో రూ.3 వేలు చొప్పున చెల్లిస్తామని మాట మార్చారు. కొసమెరుపు ఏంటంటే.. ఆ సొమ్ములో ఒక్క రూపాయి కూడా మహిళల చేతికి అందదు. ఈ మొత్తాన్ని డ్రా చేసేందుకు వీల్లేదని, పెట్టుబడి నిధిగా పరిగణిస్తామని ప్రకటించారు. ఇదీ చంద్రబాబు గారి డ్వాక్రా రుణమాఫీ కథ.

 

విజయవాడ సెంట్రల్/మచిలీపట్నం : డ్వాక్రా అక్కచెల్లెళ్ల కన్నీళ్లు తుడవటం సంగతేమో గానీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యే దశలోనూ రుణమాఫీ చేయకుండా సాగదీత ధోరణితో వ్యవహరి స్తోంది. మూడు వాయిదాల్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని తాజాగా ప్రకటించిన ప్రభుత్వం.. ఈ ప్రక్రియనూ జాప్యం చేసేం దుకు కంకణం కట్టుకున్నట్టుంది. తాజాగా పంపిణీ చేస్తున్న రుణమాఫీ పత్రాల్లో తప్పులు నమోదు చేశారు. కొన్ని సంఘాలకు ఇచ్చిన మాఫీ పత్రాల్లో వడ్డీ మాఫీ కాలం వద్ద సున్నాగా చూపటం గమనార్హం. మీరే మీ-సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో వాటిని సరిచేసుకోవాలని డ్వాక్రాా సంఘాలకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.



ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కొక్క సభ్యురాలికి రూ.10 వేల చొప్పున ఇస్తామని చెప్పిన నగదు వస్తుందా, రాదా అనే మీమాంసలో డ్వాక్రా మహిళలు కొట్టుమిట్టాడుతున్నారు. డ్వాక్రా సంఘం పేరుతో విడుదలైన రుణమాఫీ పత్రంలో జరిగిన తప్పులను సరిచేసుకునేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో అవకాశం కల్పించినట్లు ప్రకటించారు. అయితే గురువారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికి పూర్తవుతుందో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది.



సభ్యుల కుదింపు...: జిల్లాలో 57,369 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో 6,10,394 మంది సభ్యులు ఉన్నారు. వివిధ కారణాలు చూపి డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల సంఖ్యను గురువారం సాయంత్రానికి 5,64,987కు కుదించారు. ఈ సంఖ్యలో కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని డీఆ ర్డీఏ అధికారులు చెబుతున్నారు. 5,64,987 మంది డ్వాక్రా సభ్యులకు ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున రుణమాఫీ సొమ్ముగా విడుదల చేసేందుకు రూ.169.49 కోట్లు అవసరమని నిర్ధారించారు. ఒక్కొక్కరికి మొదటి విడతలో రూ.3 వేలు, రెండో విడతలో రూ.3 వేలు, మూడో విడతలో రూ.4 వేలు చొప్పున సొమ్ము డ్వాక్రా గ్రూపు ఖాతాలకు జమచేస్తామని అధికారులు చెబుతున్నారు.



పది మంది సభ్యులు ఉన్న డ్వాక్రా సంఘంలో లక్ష రూపాయల నగదు జమ అయినప్పటికీ ఈ నగదును డ్రా చేసుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం నిబంధనలు విధించింది. డ్వాక్రా సంఘానికి సంబంధించి పెట్టుబడి నిధిగా ఈ నగదును పరిగణించి 5 నుంచి 6 రెట్లు బ్యాంకు నుంచి రుణం పొందవచ్చనే కొత్త రాగాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. మొదటి విడతలో ఒక్కొక్క సభ్యురాలికి రూ.3 వేలు చొప్పున డ్వాక్రా సభ్యులందరికీ కలిపి రూ.175 కోట్లు, వడ్డీ మాఫీ కింద రూ.108 కోట్లు విడుదల చేయనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ గురువారం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతా జరిగినా బ్యాంకు అధికారులతో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి సమావేశం నిర్వహించలేదు. జూన్ ఒకటిన ఈ సమావేశం నిర్వహించి విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.  



ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగుతోంది...

జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన రుణమాఫీ పత్రాల్లో తప్పులు దొర్లాయని, వాటిని సరిచేసే ప్రక్రియ కొనసాగుతోందని డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆయా డ్వాక్రా సంఘాల లీడర్లు మీ-సేవా కేంద్రాలకు వెళ్లి ఈ తప్పులను సరిచేసుకునే పనిలో ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కొన్ని డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు వేరే ప్రాంతానికి వలస వెళ్లటమో లేక వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లటం వంటి కారణాలతో సభ్యుల సంఖ్య తగ్గింది. ఇది ఎంతమేర తగ్గిందనేది ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయితే గాని చెప్పలేని పరిస్థితి ఉంది. జూన్ మూడో తేదీ నుంచి మొదటి విడత చెక్కులు అందజేస్తామని చెబుతున్నారు.

 

కోతల వాతలు

సామాజిక పింఛన్లు, రైతు రుణమాఫీ తరహాలోనే డ్వాక్వా, డ్వాక్రా రుణమాఫీలోనూ కోతల వాతలు పెట్టాలని సర్కార్ యోచిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెప్మా పరిధిలో విజయవాడ నగరపాలక సంస్థలో 11,500, మచిలీపట్నంలో 3,011, గుడివాడలో 1,433, జగ్గయ్యపేటలో 850, నూజివీడులో 657, నందిగామలో 674, పెడనలో 466, తిరువూరులో 483, ఉయ్యూరులో 621 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. సుమారు రెండు లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. గ్రూపు సభ్యుల ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేశారు. 6 నుంచి 10 శాతం మేర డిఫాల్ట్ గ్రూపులు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top