అన్నివిధాలా ఆదుకుంటాం

అన్నివిధాలా ఆదుకుంటాం - Sakshi


కాకినాడ క్రైం / పిఠాపురం :వాకతిప్ప పేలుడు బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సోమవారం నాటి దుర్ఘటనలో బాధితులైన వారిని పరామర్శించేందుకు ఆయన మంగళవారం జిల్లాకు వచ్చారు. విజయవాడ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణం చేరుకున్నారు.

 

 ఉదయం 10.30 గంటలకే సీఎం వస్తారని చెప్పినా ఆయన కాకినాడ చేరుకునే సరికి మధ్యాహ్నం 3.30 గంటలైంది. పోలీసు కార్యాలయం ప్రాంగణం నుంచి కారులో కాకినాడ జీజీహెచ్ చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పరిశీలించారు.  మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుర్ఘటన జరిగిన తీరు, మృతులు, చికిత్స పొందుతున్న వారి వివరాలు కలెక్టర్ నీతూప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని బాణ సంచా తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

 కాకినాడ నుంచి కారులో వాకతిప్ప వెళ్లారు. అక్కడ ఎస్సీ కాలనీ వద్ద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తొలుత అనుకున్న దాని ప్రకారం ఆయన దుర్ఘటన స్థలానికి వెళ్లాల్సి ఉంది. అయితే సమయం లేనందున వెనుదిరిగారని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ చెప్పారు. ముఖ్యమంత్రి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ రాముడు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వర్మ, కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.పవన్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు ఉన్నారు.

 

 కాగా దుర్ఘటన స్థలం వద్ద ముఖ్యమంత్రి రాకకోసం ఎదురు చూస్తున్న వారు ఆయన రాకపోవడంతో నిరాశ చెందారు. అయితే ముఖ్యమంత్రికి అత్యవసరమైన పని ఉందని, చీకటి పడుతుండడం వల్ల వెనుదిరిగారని ఎమ్మెల్యే వర్మ వారికి వివరించారు.  మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.3 లక్షలకు పెంచారని, ఐఏవై గృహాలు నిర్మిస్తారని, మృతుల పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆదేశించారని చెప్పారు.

 

 తహసీల్దారు సస్పెన్షన్

 కాగా పేలుడు ఘటనకు బాధ్యుడిగా కొత్తపల్లి తహసీల్దారు పినిపే సత్యనారాయణను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే వర్మ తెలిపారు. అనుమతి లేకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా, జనసమ్మర్దం గల ప్రాంతలో మందుగుండు సామగ్రి తయారు చేసి విక్రయిస్తుంటే తహసీల్దారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే ప్రమాదానికి ఆయనను బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకున్నారని వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top