ఈ పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు

ఈ పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు - Sakshi


మంత్రి నారాయణకు సీఎం దంపతుల పరామర్శ



నెల్లూరు రూరల్‌: మంత్రి నారాయణ కొడుకు నిషిత్‌ అకాల మరణం తనను కలచి వేసిందని, ఈ పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి శనివారం వచ్చి ఆయనను పరామర్శించారు. నిషిత్‌ చిత్రపటానికి పూలమాల వేసి వారు నివాళులర్పించారు. నారాయణ కుటుంబ సభ్యులతో సీఎం కొంతసేపు గడిపారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. నిషిత్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం దురదృష్టకరం, బాధాకరమన్నారు.



మంత్రి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఉంటే, నారాయణ విద్యాసంస్థలను నిషిత్‌ సమర్థంగా నడిపేవాడన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో కొడుకు మృతిచెందడం నారాయణకు తీరని లోటన్నారు. ఈ విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. నారాయణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రబాబు హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్లిపోయారు. చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top