వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా!

వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా! - Sakshi


వ్యవసాయంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల

 

హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రకటించిన ఏడు యంత్రాంగాలలో (మిషన్స్) ఒకదాన్ని వ్యవసాయానికి కేటాయించినట్టు తెలిపారు. నీరు-వ్యవసాయం పేరిట ఈ యంత్రాంగాన్ని అమలు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతులకు అండగా నిలవనున్నట్టు ప్రకటించారు. ఆయన బుధవారమిక్కడ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి వ్యవసాయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఇది నాల్గోది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సుమారు 70 శాతం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగం గత పదేళ్లలో కుదేలయిందన్నారు. వ్యవసాయాన్ని, అనుబంధ పరిశ్రమలను తిరిగి గాడిన పెట్టి లాభసాటిగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పెప్సీ వంటి కార్పొరేట్ సంస్థల సాయం కూడా తీసుకుంటామన్నారు. రైతుల అవస్థలు చూసి వాళ్ల భారాన్ని ప్రభుత్వ అధినేతగా తాను మోయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకున్నారు. దానిలో భాగంగానే రైతులకు పంట రుణాలు, బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాలు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేసినట్టు వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...



గత పదేళ్లలో పాలకులు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది. విస్తరణను దెబ్బతీయడంతో ఉత్పాదక శక్తి పడిపోయింది. సాగునీటిని సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. భూ వినియోగం తగ్గింది. ఫలితంగా రైతులు అప్పుల పాలయ్యారు.



2004 నుంచి 14 వరకు పంటల దిగుబడి గణనీయంగా తగ్గింది. ఆదర్శరైతుల వ్యవస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రూ. 29 కోట్ల  దుబారా చేసింది. వర్షాల కోసం మేఘమధనం పేరిట 127 కోట్లు నొక్కేశారు. అన్నపూర్ణవంటి కోనసీమలో పంట విరామం కాంగ్రెస్ చలువే.

  కాంగ్రెస్ హయంలో 2004 నుంచి 14వరకు 1,943మంది రైతులు దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటే నేతలు నోరు మెదపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకు రూ.47,838.02 కోట్లు అడిగితే కేంద్రం రూ.7,895.52 కోట్లను మాత్రమే ఇచ్చింది



రాష్ట్ర విభజనతో 969 పరిశోధనా సంస్థలు తెలంగాణలో ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 309 సంస్థలు మాత్రమే దక్కాయి.  మా లక్ష్యం ఉత్పత్తిని, భూసారాన్ని పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం. రైతుల్ని ఆదుకోవడమే మా లక్ష్యం, అందుకోసం అన్ని వనరులను సమీకరిస్తాం. వ్యవసాయానుబంధ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం పెప్సీ వంటి పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తాం. అవసరమైతే ఎర్రచందనం అమ్ముతామే తప్ప స్మగ్లర్లను, మద్యం, ఇసుక మాఫియాలను ప్రోత్సహించం.



స్వామినాధన్ చెప్పినట్టుగా గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కోర్సులు ప్రవేశపెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. కౌలు రైతులకు కూడా రుణమాఫీ వర్తిస్తుంది. వారి అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం.అప్పుల పాలై, ఆత్మస్థైర్యం కోల్పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇదో మానసిక రుగ్మత. రైతులు దిగాలు పడితే యావత్తు కుటుంబమే కుదేలవుతుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top