నా రోడ్లపై నడుస్తూ.. నా పింఛన్లు తీసుకుంటూ..నాకు ఓటేయరా?

నా రోడ్లపై నడుస్తూ.. నా పింఛన్లు తీసుకుంటూ..నాకు ఓటేయరా? - Sakshi


సీఎం చంద్రబాబునాయుడు వింత వ్యాఖ్యలు

నంద్యాల: ‘‘నేను ఇచ్చే పెన్షన్, రేషన్‌ తీసుకుంటున్నారు, మేం వేసిన రోడ్లపైన తిరుగుతున్నారు. కానీ నాకు ఓటు వేయకపోతే ఎలా? లేకపోతే పెన్షన్లు, రేషన్‌ తీసుకోవద్దు. ఓటెయ్యని గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుంది.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓటుకు రూ.వెయ్యి నుండి రూ.5 వేలు ఇవ్వగలనని, కాని ఇందుకు అవినీతికి పాల్పడాల్సి వస్తుందని, దరిద్రం గొట్టు రాజకీయాలు చేయలేనన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇఫ్తార్‌ విందులో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు  గురువారం తనను కలిసిన ప్రజలు, పలు సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.



తాను రూ.వెయ్యి పింఛన్‌ ఇస్తున్నానని, రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేశానని గుర్తు చేశారు. అయినా కొందరు నేతలు ఓటుకు ఇచ్చే రూ.500 ఎందుకు తీసుకుంటున్నారని, దీనివల్ల ఏమొస్తుందని ప్రశ్నించారు. తానూ ఓటుకు రూ.వెయ్యి నుండి రూ.5వేలు ఇవ్వగలనని, ఇందుకోసం అవినీతికి పాల్పడాల్సి వస్తుందన్నారు.  తాను పింఛన్, రేషన్‌ ఇస్తున్నానని, తాను వేసిన రోడ్లపైన తిరుగుతున్నప్పుడు తనకే ఓటు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తనకు ఓటు వేయని గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుందని బెదిరించారు.



అశ్లీల కామెంట్‌కు బాబు కితాబు: తనవల్ల లబ్ధి పొందినప్పుడు తనకు ఓటు వేయాలని బాబు వ్యాఖ్యానించినప్పుడు టీడీపీ నేత ఒకరు నినాదాలు చేస్తూ.. ‘‘ఒక అబ్బ, ఒక అమ్మకు పుట్టిన వాడు ఓటెయ్యాలని’’ అన్నారు. చంద్రబాబు అతని వైపు చూసి కరెక్ట్‌ అని వ్యాఖ్యానించారు.



సాక్షి పత్రిక చదవద్దు.. టీవీ చూడొద్దు: సాక్షి దినపత్రికను చదవవద్దని, టీవీని చూడొద్దని చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం రాత్రి ఆయన కౌన్సిలర్లతో, పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు సాక్షి మీడియాలో వ్యతిరేకత వార్తలు వస్తున్నాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top