పుష్కర క్షోభ


 ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా ఉంది ప్రభుత్వోద్యోగుల పరిస్థితి. గోదావరి పుష్కర మహాపర్వం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా.. రాష్ర్ట మంత్రులు.. ఉన్నతాధికారులు.. మొత్తం రాష్ర్ట పాలనా యంత్రాంగ మంతా రాజమండ్రిలోనే రోజుల తరబడి కొలువుదీరింది. అమాత్యులు, పెద్ద దొరలు ఉన్నారంటే మాటలా..! ప్రొటోకాల్ ప్రకారం వారికి సకల మర్యాదలూ చేయాల్సిందే! వారికి, వారి మంది మార్బలానికి టిఫిన్లు, భోజనాలు, మినరల్ వాటర్, ఏసీ గదులు.. వారి పర్యటనలకు కావాల్సి వాహనాలు.. ఇలా అన్నీ దిగువస్థాయి అధికారులే సమకూర్చాలి. వీటన్నింటికీ అయిన ఖర్చును వారే భరించాల్సి వచ్చింది. పన్నెండు రోజుల పండగ ముగిసిన తరువాత లెక్కలు చూసుకుంటే.. తమకు వేలల్లో చేతిచమురు వదిలిపోయిందని.. ఈ మర్యాదల బాధ్యతలు చూసిన ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.

 

 ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :పుష్కరాల పేరు చెప్పి డివిజన్ స్థాయి ఉద్యోగులకు చేతిచమురు బాగానే వదిలిపోయింది. ప్రొటోకాల్ ప్రకారం మంత్రులకు, ఉన్నతాధికారులకు అవసరమైన సేవలు అందించేందుకు వేలాది రూపాయలు మంచినీళ్లప్రాయంలా ఖర్చయిపోయాయని ఉద్యోగులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని 12 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా దాదాపు రాజమండ్రిలోనే బస చేసింది. దీంతో ఇక్కడకు వచ్చే రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగులకు వసతి, ఇతర ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల డివిజన్ స్థాయి సిబ్బందిపై పడింది. వచ్చే పెద్దల కోసం హోటళ్లు, రిసార్ట్‌లు, ప్రైవేటు ఫామ్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్‌లు.. ఇలా దాదాపు అందుబాటులో ఉన్న అన్ని రూములూ ముందుగానే సిద్ధం చేశారు.

 

  అయితే పుష్కరాలకు లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో  పెట్టుకుని ఆయా రూముల అద్దెలు ఆకాశాన్నంటాయి. ఒక్కో రూముకు రోజుకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకూ చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు రూముల్లో బస చేసేవారికి టిఫిన్లు, భోజనాలు సమకూర్చేందుకు అదనంగా ఖర్చయ్యాయి. అంతేకాదు.. ఆయా పెద్దల కుటుంబ సభ్యులను గోదావరి స్నానానికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా కార్లు కూడా అందుబాటులో ఉంచారు. ఒక్కో కారుకు రోజుకు రూ.2500 వరకూ చెల్లించాల్సి వచ్చింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న రోజుల్లోనైతే వాహనాల కోసం రూ.4 వేలు చెల్లించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వచ్చిందేమో ఉన్నతాధికారులాయె.

 

 వారు చెప్పింది చెప్పినట్లు చేయకపోతే ఏం కొంపలంటుకుంటాయోనన్న ఆందోళనతో సొంత డబ్బులు వెచ్చించి మరీ ఏర్పాట్లు చేసేశారు. ఇలా కింది స్థాయి ఉద్యోగులు సొంతంగా వెచ్చించిన సొమ్ము దాదాపు రూ.4 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంచనా. పెట్టిన ఖర్చు వేలల్లో ఉండడంతో కింది స్థాయి సిబ్బంది ఎటూ పాలుపోని పరిస్థితుల్లో పడ్డారు. రాజమండ్రి డివిజన్ పరిధిలోని దాదాపు అన్ని శాఖల ఉద్యోగులదీ ఇదే దుస్థితి. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్యం, వ్యవసాయం, దేవాదాయ, విద్య, పోలీసు శాఖల్లో ఖర్చులు అధికమైనట్లు తెలిసింది.

 

 పుష్కరాలు ప్రారంభమైన రెండో రోజు రాజమండ్రి వస్తానన్న ఓ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి కోసం తెల్లవారుజామున మూడు గంటల వరకూ రూము వద్ద తాళాలు పట్టుకుని డివిజన్ స్థాయిలోని ఒక మహిళా ఉద్యోగితోపాటు పలువురు వేచి చూడాల్సి వచ్చింది. ఆయన రూములోకి వెళ్లాక ఇంటికి వెళ్లిన సదరు ఉద్యోగిని మళ్లీ ఉదయం ఆరు గంటలకల్లా అక్కడికి రావాల్సి వచ్చింది. మర్నాడు మళ్లీ ఇంకొందరు ఉన్నతాధికారులు వస్తున్నారని సమాచారం రావడంతో ఏదైతే అదే అయ్యిందిలే అని సదరు ఉద్యోగి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.

 

 జిల్లా స్థాయి అధికారి ఒకరు తన చెల్లెలు పుష్కర స్నానానికి వస్తున్నారని చెప్పడంతో కింది స్థాయి సిబ్బంది కాకినాడకు కారు పంపించి అక్కడ నుంచి ఆవిడను తీసుకువచ్చి వీఐపీ ఘాట్‌లో స్నానం చేసేవరకూ వెంటే ఉండి సాగనంపాల్సి వచ్చింది.

 రాష్ట్రమంత్రులతో వచ్చిన పర్సనల్ సెక్రటరీ, గన్‌మెన్‌కు మంత్రులతో సమానంగా సేవలు అందించాల్సిన పరిస్థితి అధికారులపై పడింది. మంత్రుల సిబ్బంది కావడంతో వారు చెప్పిన మెనూ ప్రకారమే భోజనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ప్రొటోకాల్ అంశంతో బిల్లు పెట్టినా అవి పూర్తిగా ఇచ్చే పరిస్థితి కూడా కనిపించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top