పాత, కొత్త నేతల మధ్య బిగ్‌ ఫైట్‌ షురూ..

పాత, కొత్త నేతల మధ్య బిగ్‌ ఫైట్‌ షురూ.. - Sakshi

► రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి కమిటీలు రద్దు

► త్వరలోనే కొత్త కమిటీలంటూ సీఎం ప్రకటన

► ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకే కమిటీల ఏర్పాటు

 

ఒంగోలు: ప్రస్తుతం గ్రామస్థాయిలో ఉన్న జన్మభూమి కమిటీలను రద్దు చేసి వాటి స్థానాల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన అధికార టీడీపీలో మరింత అగ్గి రాజేస్తోంది. కొత్త కమిటీల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న జన్మభూమి కమిటీలన్నీ పాత నేతల ప్రతిపాదనల మేరకే నియమించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిస్తే పాత నేతల పవర్‌ కట్‌ అయినట్లే...! రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటిని జన్మభూమి కమిటీల ప్రతిపాదనల మేరకే చేపడుతున్న విషయం తెలిసిందే. 

 

పింఛన్లు మొదలుకొని రేషన్‌ కార్డులు, పక్కా గృహాలు, నీరు–చెట్టు పనులతో పాటు అన్ని రకాల పనులు జన్మభూమి కమిటీలు ద్వారానే ఎంపిక చేస్తున్నారు. దీంతో ఏడాదిన్నరగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు క్షేత్ర స్థాయిలో ఆమోదముద్ర పడటం లేదు. దీంతో వారు నేరుగా ముఖ్యమంత్రి లేదా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌ల ద్వారా పింఛన్లు, పక్కా గృహాలు తదితర ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయించుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో జన్మభూమి కమిటిలన్నీ పాత నేతల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని దీంతో తమ పనులు కావడం లేదంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచారు. 

 

పైగా కమిటీల్లో తమకే ప్రాధాన్యతనివ్వాలంటూ వారు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఒత్తిడికి తలొగ్గిన ముఖ్యమంత్రి త్వరలోనే పాత జన్మభూమి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త కమిటీలను జాబితాలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి సైతం చేర్చారు. పాత నేతలు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం కొంత ఆలస్యమైనట్లు తెలుస్తోంది.ఎట్టకేలకు ముఖ్యమంత్రి జన్మభూమి పాత కమిటీలను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. పాత కమిటీల స్థానంలో కొత్త కమిటీలను సైతం నెలలోపే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

 

వర్గపోరుకు ఆజ్యం.. 



సీఎం ప్రకటన జిల్లా టీడీపీలో మరింత వర్గపోరుకు ఆజ్యం పోయనుంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, డేవిడ్‌రాజు, గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్‌లను అధికార పార్టీలో చేర్చుకోవడాన్ని పాత నేతలు అన్నా రాంబాబు, దివి శివరాం, కరణం బలరాం, పోతుల సునీతలు ఆదిలోనే తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు కూడా చేశారు. ముఖ్యమంత్రి వీరి అభ్యంతరాలను పట్టించుకోక ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. 

 

గిద్దలూరు, అద్దంకి, చీరాలలో పాత, కొత్త నేతల మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. జన్మభూమి కమిటీలు పాత నేతల ప్రతిపాదనల మేరకు ఉండటంతో క్షేత్ర స్థాయిలో తమ వర్గీయుల పనులు కాక ఫిరాయింపు ఎమ్మెల్యేలు పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కోకొల్లలు. ఈ వివాదం ఇరువర్గాల మధ్య మరిన్ని గొడవలకు దారి తీసింది. అయితే ముఖ్యమంత్రి ఇటీవల ఎమ్మెల్యేలకే నియోజకవర్గ అధికారాలంటూ తేల్చి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వారికే ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రకటించారు. దీనిని పాత నేతలు జీర్ణించుకోలేకున్నారు.



తాజాగా జన్మభూమి కమిటీలను సైతం ముఖ్యమంత్రి రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పాత నేతల్లో మరింత ఆందోళన నెలకొంది. కొత్త కమిటీలను ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకే ఎంపిక చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వారికే ప్రాధాన్యత ఉంటుంది. వారి అనుచరులకే పనులు జరుగుతాయి. ఇదే జరిగితే పాత నేతల పవర్‌ కట్‌ అయినట్లే..! ఇది జిల్లా టీడీపీలో వర్గవిభేదాలను మరింత రచ్చకెక్కిస్తుండటంలో సందేహం లేదు.  

 

 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top