డెంగీ నిర్మూలనకు సహకరించండి

డెంగీ నిర్మూలనకు సహకరించండి - Sakshi


గ్లోబల్‌ ఫండ్‌ సంస్థకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి



సాక్షి, అమరావతి: డెంగీ నిర్మూలనకు సహకరించాలని గ్లోబల్‌ ఫండ్‌ సంస్థకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా బుధవారం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఆ వివరాలను సీఎంవో విడుదల చేసింది. గ్లోబల్‌ ఫండ్‌ సంస్థ ప్రతినిధి క్రిస్టోఫర్‌ బెన్‌తో సీఎం సమావేశమై డెంగీ, మలేరియా నిర్మూలనకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. రాష్ట్రంలో నెలకొల్పనున్న పెట్రోలియం వర్సిటీలో భాగస్వామి కావాలని సౌదీ ఆరాంకో సంస్థ ఉపాధ్యక్షుడు అమిన్‌ హెచ్‌ నాసర్‌ను బాబు కోరారు. అమిన్‌ స్పందిస్తూ.. ఏపీతో కలసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తామని, ఇందుకోసం 15 రోజుల్లో ఒక బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు.



పీపీపీ పద్ధతిలో డిజిటల్‌ వర్సిటీకి ముందుకొస్తే సహకరిస్తామని పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్‌ శర్మకు బాబు చెప్పారు. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ సెక్వియా ఎండీ శైలేంద్రసింగ్‌తో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఫుజిసు సంస్థ కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి నొబుహుకో ససాకితో వ్యవసాయ దిగుబడులకు సాంకేతిక సహకారం కోరారు. వేదాంత రిసోర్సెస్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ఏపీలో పైలట్‌ ప్రాజెక్టుగా వంద నందఘర్‌లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ తోనూ సీఎం సమావేశమయ్యారు.



ఎన్టీఆర్‌ కలలను నిజం చేస్తాం: సీఎం  

సాక్షి,అమరావతి/నగరంపాలెం/ లబ్బీపేట: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కన్న కలలను నిజం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ 21వ వర్థంతి సందర్భంగా దావోస్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడారు.



అమరావతిలో ఎన్టీఆర్‌ మ్యూజియం

ఎన్టీ రామారావు అరుదైన చిత్రాలతో అమరావతిలో మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ చెప్పారు.  బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను లోకేశ్‌ ప్రారంభించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top