ఈ నెల 28 తర్వాత భూసేకరణే..!


- ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తే సరి.. లేదంటే భూసేకరణ అస్త్రం ప్రయోగిస్తాం

- సీఆర్‌డీఏ గ్రామాల రైతులకు తెగేసి చెప్పిన సీఎం చంద్రబాబు

- సచివాలయంలో సీఎంతో సమావేశమైన రాజధాని ప్రాంత రైతులు


 

 

సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోని గ్రామాల్లో భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను బెదిరించి దారికి తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండలాల పరిధిలోని 29 గ్రామాల నుంచి దాదాపు వందమంది రైతులను గురువారం హైదరాబాద్‌కు రప్పించి సమావేశమయ్యారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తామన్న రైతులపై సీఎం ఈ సందర్భంగా కన్నెర్ర చేశారు.


‘‘ల్యాండ్ పూలింగ్‌కు సహకరిస్తే సరి.. లేదంటే ఈ నెల 28 తర్వాత భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తాం’ అని తెగేసిచెప్పారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సీఎం చంద్రబాబు ఆ దేశ మంత్రి షణ్ముగం గురువారం హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో రైతులను హుటాహుటీన రప్పించడం గమనార్హం. షణ్ముగంతో భేటీ పూర్తయిన కొద్దిగంటల్లోనే రైతులతో సీఎం సమావేశమయ్యారు. కర్షకులు తమ డిమాండ్లను ఏకరువు పెట్టారు.

 

‘‘జరీబు భూములకు ఎకరానికి 1000 గజాలు కాకుండా 1400 గజాల ప్లాట్లు ఇవ్వాలి. మల్లెతోటలు.. పండ్ల తోటలకు ఎకరానికి రూ.50 వేలు కాకుండా కనీసం రూ.రెండు లక్షలివ్వాలి. సీఆర్‌డీఏ పరిధిలో గతంలో రియల్ వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను ల్యాండ్‌పూలింగ్‌నుంచి మినహాయించాలి. పశువుల మేతకోసం గ్రామం చుట్టూ 500 మీటర్ల మేరకు భూమిని ఖాళీగా ఉంచాలి’’ అని విన్నవించారు. సీఎం ముక్తసరిగా స్పందిస్తూ.. ‘‘మీ డిమాండ్లపై మంత్రుల కమిటీతో చర్చించి.. ఓ నిర్ణయం చెబుతా. రాజధాని నిర్మాణం వేగంగా జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కొందరు రైతులవల్ల రాజధాని నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంటోంది. ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తే సరి.. లేదంటే 28 తర్వాత భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాం’’ అని తెగేసిచెప్పారు.


కాగా తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తామని.. లేదంటే సీఆర్‌డీఏ గ్రామాల్లో సమావేశాలుపెట్టి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామన్న తమను చంద్రబాబు తీవ్రస్థాయిలో బెదిరించినట్లు కొందరు రైతులు పేర్కొంటూ భయాందోళన వ్యక్తం చేశారు. సీఎంతో సమావేశానంతరం మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన కె.శివసత్యనారాయణ, చావలి లింగయ్య, వెంకట నారాయణలు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top