పట్టణ నడిబోడ్డున యువతి దారుణ హత్య

పట్టణ నడిబోడ్డున యువతి దారుణ హత్య


రాత్రి 7.30 గంటలు.... అందరూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్నారు.... అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో ఒక్కసారిగా ఏడుపులు, కేకలు మిన్నంటాయి. ఉలిక్కి పడిన ఆ వీధివాసులు పరుగుపరుగున బయటకు వచ్చి చూసేసరికి...రక్తపు మడుగులో ఓ యువతి పడి ఉంది. తమ ఇళ్లమధ్యే హత్య జరగడంతో అందరూ నిర్ఘాంతపోయారు. సమాచారం దావానలంలా వ్యాపించడంతో అక్కడికి పెద్ద ఎత్తునజనం చేరుకున్నారు. ఇంట్లో ఉంచుకుంటే అల్లుడే ఇంత పనిచేస్తాడని ఊహించలేకపోయామని మృతురాలి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.  

 

 

విజయనగరం క్రైం: విజయనగరం పట్టణ నడిబోడ్డున యువతి దారుణ హత్యకు గురవడం  సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి యువతి తల్లిదండ్రులు, స్థానికులు, పోలీసులు  అందించి న వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో కూర్మదాసు సూర్యనారాయణ, లక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. కూర్మదాసు రోడ్డు పై పుస్తకాలు విక్రయిస్తూ, ఆయన భార్య లక్ష్మి వంటలు  చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి కుమారుడు ఏడాది క్రితం మృతి చెందాడు.

 

ఇద్దరు కుమార్తెలలో పెద్దకుమార్తె దుర్గాదేవిని నాలుగేళ్ల క్రితం ఎస్.కోటకు చెందిన ఎ.నానాజీ కి ఇచ్చి వివాహం చేశారు. చిన్న కుమార్తె లలితాదేవి తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఇంటివద్దే టైలరింగ్ చేస్తోంది. నెల క్రితం నానాజీ  కుటుంబ సభ్యులతోపాటు అత్తమామలు తిరుపతి యాత్రకు వెళ్లారు. యాత్ర  ముగించుకుని వచ్చిన తర్వాత నానాజీ  ఎస్.కోటకు వెళ్లకుండా రాజీవ్‌నగర్ కాలనీలోనే మామగారి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. నానాజీ భార్య దుర్గాదేవి ప్రస్తుతం గర్భిణి. నానాజీ తన మామ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించాడు.  సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నానాజీని పట్టుకుని, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు.  

 

బుధవారం ఉదయం సూర్యనారాయణ పుస్తకాలు అమ్ముకునేందుకు వెళ్లగా, భార్య లక్ష్మి వంటలు  చేసేందుకు వెళ్లింది. రెండో కుమార్తె లలితాదేవి ఇంటివద్దే ఉంది. లక్ష్మి వంటపని ముగించుకొని రాత్రి ఏడున్నరగంటల ప్రాంతంలో ఇంటికి చేరేసరికి, ఇంట్లో ఉన్న మంచం మీద లలితాదేవి అర్ధనగ్నంగా పడి ఉంది. ఆమెకు నైటీ వేసి, కేకలు వేయడంతో స్థానికులు వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు.  లలితాదేవి నోట్లో, మెడ, ముఖంపై రాడ్డుతో పొడిచినట్లుగా గాయాలున్నాయి. గోడపై రక్తం మరకలు చిందాయి.

 

ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉన్నాయి. వాటిలో ఉండవలసిన సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.5 వేల నగదు కనిపించలేదు.  ఇంట్లో ఉండవలసిన పెద్ద కుమార్తె, అల్లుడు 6.30 గంటల సమయంలో బయటకు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, సీఐ కె.రామారావు, ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్ చేరుకున్నారు. డీఎస్పీ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వివరాలు అడిగితెలుసుకున్నారు. లలితాదేవిని హత్యకు వినియోగించిన రాడ్లను, మంచం కింద ఉన్నవాటిని పరిశీలించారు.

 

అక్కాబావలపై అనుమానం..

ఇంట్లో లలితాదేవితోపాటు నానాజీ, అక్క దుర్గాదేవి ఉన్నారు. దుర్గాదేవి,  నానాజీలు  లలితాదేవిని రాడ్డుతో పొడిచి చంపినట్లుగా తండ్రి సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ అల్లుడు తాగి వచ్చి గొడవపడుతుండేవాడని  వాపోయాడు. లలితాదేవి అర్ధనగ్నంగా మంచంపై పడి ఉండడాన్ని బట్టి నానాజీ లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

 

సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో  నానాజీ,   దుర్గాదేవి ఇంటినుంచి పరారవడాన్ని బట్టివారే హత్యచేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నానాజీ, దుర్గాదేవిలను పట్టుకోవడానికి రెండు టీంలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. లైంగిక దాడి జరిగిందా లేదా అనేది వైద్యులు ఇచ్చే నివేదికను  బట్టి తెలుస్తుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్టు తెలిపారు.



సంఘటన స్థలానికి క్లూస్ టీం

సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు. క్లూస్ ఏఎస్‌ఐ టి. విజయ, సభ్యులు సత్యనారాయణ, రాజు, శ్రీను వేలిముద్రలను సేకరించారు.

 

రోదిస్తున్న తల్లిదండ్రులు..

లలితాదేవి హత్యకు గురవడంతో తల్లిదండ్రులు లక్ష్మి, సూర్యనారాయణ భోరున విలపిస్తున్నారు. ఇంట్లో ఉంచుకుంటే ఇంతపని చేస్తాడని ఉహించలేకపోయామని, కుమార్తెను హత్యచేసి, పెళ్లికోసం ఉంచిన బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడని ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top