నగరాన్ని సుందరీకరించండి


- కలెక్టర్ అరుణ్‌కుమార్

- ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు పిలుపు

- మునిసిపల్ అధికారులతో సమీక్ష

కాకినాడ సిటీ :
రానున్న జూన్, జూలై నెలల్లో కాకినాడ నగరంలో ప్రజా భాగస్వామ్యంతో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం, ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనుల నిర్వహణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కాకినాడ నగర అభివృద్ధి అంశాలపై కలెక్టర్ అరుణ్‌కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వీధికుక్కలు, పిచ్చికుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.



ర్యాబిస్ సోకిన పిచ్చి కుక్కలను పట్టి నిర్మూలించాలని, వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్న చోట వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, ర్యాబిస్ సోకకుండా వ్యాక్సిన్‌లు చేపట్టాలని ఆదేశించారు. అలాగే వాటి నిర్మూలనకు క్రూర విధానాలు కాకుండా, వాటికి ఆహారం దొరకకుండా నిరోధిస్తే వాటి సంఖ్య తగ్గిపోతుందన్నారు. ఇందుకు హోటళ్లు, కల్యాణ మండపాలు, మాంసం విక్రయ బడ్డీలు తదితర చోట్ల మిగిలి పోయే ఆహారపదార్థాలు బయట పడవేయకుండా నిషేధించాలని సూచించారు. నగరంలోని మున్సిపల్ స్థలాలు, ఆస్తుల ఇన్వెన్టరీ తయారీ చేసే ఆక్రమణ, అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆదేశించారు.



ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించేటప్పుడు దారిపొడవునా జారిపడకుండా, చెత్తపై వలలు కప్పి తరలించాలని ఆదేశించారు. వేసవిలో నగర ప్రజలకు తాగునీటి ఎద్దడి ఎదురు కాకుండా ముందు జాగ్రత్తలతో అన్ని చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఏ విధానం, సరఫరా షెడ్యూల్ చేపట్టినా ముందుగా ప్రజలకు తెలియజేసి అమలు పరచాలని సూచించారు. మీ సేవా ద్వారా జనన, మరణ ధృవపత్రాల జారీ ప్రక్రియను మరింత సరళంగా, వేగంగా ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన డేటా సేకరణ, సవరణ, వాలిడేషన్, ఆన్‌లైన్ అప్‌డేషన్ అంశాలను జూన్ పది నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.



రోడ్ల విస్తరణ, అర్బన్ వాటర్ వర్క్స్ పనులకు అన్ని అనుమతుల ఉండి, నిధుల కొరత లేకున్నా పనులు నత్తనడకన జరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే నిర్లిప్త వైఖరి కొనసాగితే ఉపేక్షంచేది లేదని హెచ్చరించారు. నగరంలో కొత్తగా విలీనం అవుతున్న పంచాయతీల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని, అవసరమైతే రవాణా చేయాలని ఆదేశించారు. నగరంలో నెలకొల్పిన ఆర్వోప్లాంట్లు గరిష్టస్థాయిలో ప్రయోజనకరంగా ఉండేలా నిర్వహించాలని ఆదేశించారు. నగరపాలకసంస్థకు ఆస్తి పన్ను, ప్రకటనల పన్నుల ద్వారా చేకూరే ఆదాయాన్ని పూర్తిస్థాయిలో వసూళ్లు చేయాలని ఆదేశించారు.



నగరంలోని అన్ని హోర్డింగ్‌లకు విశిష్ట గుర్తింపు సంఖ్యలు వేయించాలన్నారు. పన్ను మదింపుకాని, అండర్ అసెస్‌మెంట్, తప్పు అసెస్‌మెంట్ ఆస్తులన్నిటినీ గుర్తించి పన్ను రాబట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామి, డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, మున్సిపల్ ఎస్‌ఈ నవరోహిణి, ఈఈ సూర్యనారాయణ, సిటీ ప్లానర్ రాంబాబు, ఎంహెచ్‌ఓ డాక్టర్ కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top