చింతాడలో సినీ సందడి


► స్వగ్రామంలో సందడి చేసిన ప్రభాస్‌ శ్రీను 

► అసిరమ్మ తల్లి పండగల్లో క్రీడాపోటీల 

► విజేతలకు బహుమతులు ప్రదానం

 

ఆమదాలవలస : ఫ్లెక్సీలు, పండగ వాతావరణం, యువకుల సందడి చూస్తుంటే చింతాడ గ్రామం చెన్నై పట్టణాన్ని తలపిస్తోందని సినీ నటుడు ప్రభాస్‌ శ్రీను అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలోని 7వ వార్డులో స్వగ్రామమైన చింతాడకు శుక్రవారం ఆయన విచ్చేశారు. అసిరమ్మ తల్లి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కలిసి కట్టుగా ఉంటే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందన్నారు. ప్రతిఒక్కరూ తనలోని వ్యక్తిగత ప్రతిభను గుర్తించి ఆ దిశగా ప్రయత్నం చేయాలన్నారు. స్వగ్రామమైన చింతాడ అభివృద్ధికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రానున్న రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలకు ఏ నటుడిని తీసుకురమ్మని చెప్పినా తెస్తానని యువకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సినిమాల్లోని డైలాగ్‌లు చెబుతూ యువతను ఉర్రూతలూగించారు.

 

అనంతరం క్రికెట్‌ పోటీల విజేత శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల జట్టుకు రూ.10 వేలు, ట్రోఫీ, రన్నరప్‌ ఆమదాలవలస మండలం వంజంగి జట్టుకు రూ.3వేలు, జ్ఞాపికను అందజేశారు. వాలీబాల్‌ పోటీల విజేత ఆమదాలవలస మండలం వెదుళ్లవలస జట్టుకు రూ.10 వే లు, ట్రోఫీ, రన్నరప్‌ సరుబుజ్జలి మండలం సవలాపురం జట్టుకు రూ. 2500, జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో ప్రభాస్‌ శ్రీను తండ్రి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌ ఎర్రన్నాయుడు, చింతాడ పెద్దలు బోర రమణయ్య, బోర గోవిందరావు, బోర చిన్నం నాయుడు,  నారాయణరావు,  అమ్మన్నరావు, సారికి రామారావు, తోట రామారావు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 

 

సినిమాకు కామెడీయే ప్రాణం..

తెలుగు సినిమాకు కామెడీయే ప్రాణమని ప్రభాస్‌ శ్రీను అన్నారు. శివరాత్రి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని అనంతరం రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ  జిల్లా వాసిగా సినీఇండస్ట్రీలో స్థానం దక్కడం అదృష్టమని తెలిపారు. అనంతరం అరసవల్లి ఆలయానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని కలిసి కాసేపు మాట్లాడారు. పలువురు అభిమానులతో ఫొటోలు దిగారు.  

 

ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

 ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఎలాంటి పనినైనా సాధించవచ్చని ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ శ్రీను అన్నారు. అసిరమ్మ తల్లి పండగ సందర్భంగా చింతాడ వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. 

ప్రశ్న: సినీ రంగంలోకి  వెళ్లాలని ఎలా అనిపించింది?

జవాబు: ఉన్నత చదువులు అబ్బక పోవడంతో డ్యాన్స్‌ వైపు మొగ్గు చూపించాను. నాన్న యర్రయ్య ప్రోద్బలంతో నటుడిగా రంగ ప్రవేశం చేశాను.

ప్ర: ప్రభాస్‌ శ్రీను అనే పేరు ఎలా వచ్చింది?

జ: తొలిసినిమా వర్షం సినిమాలో ప్రభాస్‌తో నటించడంతో అలా మారింది. 

ప్ర: ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు?

జ: 100 సినిమాలకు పైగా 

ప్ర:  ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు?

జ: యు.వి.క్రియేషన్స్‌ వారి భాగమతి, ఇటీవల రిలీజ్‌ అయిన కేరాఫ్‌ గోదావరిలో కామెడీ విలన్‌ పాత్ర పోషించాను. 

ప్ర:  క్లోజ్‌ ఫ్రెండ్స్‌?

జ: ప్రవీణ్, రవిబాబు, బ్రహ్మానందం

ప్ర: యువతకు మీరు ఇచ్చే సందేశం?

జ: దేశ పురోగాభివృద్ధికి యువతే కీలకం. ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ముందుకు పోతే సమస్యలు పరిష్కారమై ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top