తాంబూలంలో పెట్టి ఇచ్చేయటం లేదు

తాంబూలంలో పెట్టి ఇచ్చేయటం లేదు


ఆస్పత్రుల్లో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటేనే మెరుగైన సేవలు

వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి  సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు

చిత్తూరు ఆస్పత్రిని అపోలోకు ఇవ్వడంపై సమర్థన


 

చిత్తూరు(అర్బన్): ‘ప్రభుత్వ ఆస్పత్రులను అడిగిన వెంటనే తాంబూలంలో పెట్టి ఇచ్చేయడంలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడే అపోలో సంస్థలకు లీజుకు ఇస్తున్నాం. ఇందు లో ఏదో జరిగిపోతోందని పాత్రికేయులు ఊహాజనిత కథనాలు రాస్తున్నారు. అయినా ఇక్కడ (చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో) వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా మీరే చెప్పండి? ఉంటే నేను మధ్యాహ్న భోజనం తినడం మానేస్తా..’ అని రాష్ట్ర వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. అపోలో వైద్య సంస్థలకు లీజుకు ఇవ్వడం కోసం ఏర్పాటైన కమిటీ శుక్రవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించింది.



ఈ సందర్భంగా సుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేటు భాగస్వామ్యం ఉండటం వల్ల పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 320 పడక లు ఉంటే భవిష్యత్తులో 1,200 పడకలుగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఆస్పత్రిలో పెట్టుబడులు, ఆధునికీకరణ తో పాటు  వైద్య వృత్తికి సంబంధించిన అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. నంద్యాల, విజయనగనం ప్రభుత్వాస్పత్రుల్లో కూడా డీమ్డ్ కోర్సులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు వెళ్లాయని స్పష్టం చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమక్షంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని మౌలిక సదుపాయాలు, భవనాల వివరాలపై జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.



సీపీఐ నాయకుల ఆందోళన

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఆస్పత్రి వద్ద ఎల్వీ.సుబ్రమణ్యానికి వినతిపత్రం అందజేశారు. మురకంబట్టులో అపోలో వైద్య కళాశాలకు సేకరించిన స్థలాలకు పరిహారం ఇవ్వలేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కమిటీ సమావేశం జరుగుతుండగా ప్రభుత్వానికి, అపోలో ఆస్పత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top