చిరుద్యోగులతో చెలగాటం


ఐసీడీఎస్ ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని సంజీవనగర్ ఎస్సీ కాలనీలో ఉన్న 121వ అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా సుబ్బమ్మ పనిచేస్తోంది. ఈమెకు నెలకు రూ.4,231 వేతనంతోపాటు రూ.3వేలు అంగన్‌వాడీ కేంద్రానికి బాడుగ, వంట వండినందుకు కట్టెల బిల్లు రూ.300, కూరగాయల బిల్లు రూ.487, టీఏ రూ.80  చొప్పున ప్రతి నెలా చెల్లించాల్సి ఉంది. జూలై నుంచి ఇప్పటి వరకు అధికారులు బాడుగ చెల్లించకపోగా ఆగస్టు నుంచి వేతనంతోపాటు మిగతా బిల్లులు ఇవ్వలేదు. పోషకాహారం లోపం ఉన్న పిల్లలకు రోజు డబ్బు చెల్లించి పాలు పంపిణీ  చేస్తోంది. వేతనంతోపాటు బిల్లుల చెల్లింపులో ఆలస్యం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 


 ప్రొద్దుటూరు: చాలీచాలని గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీల వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ప్రతి నెల వేతనం వస్తే కానీ కుటుంబాలు గడవని వారు ఎంతో మంది ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణప్రాంతాల్లో రూ.3వేల వరకు వెచ్చించి అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. వేతనం ఆలస్యమైనా ఇంటి అద్దె మాత్రం యజమానికి ప్రతి నెల తప్పక చెల్లించాల్సి ఉంది. అటు వేతనం రాక, ఇటు అద్దె బకాయిలు అందకపోవడంతో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



రూ.20 నుంచి 30వేలు వేతనం తీసుకునే ఉద్యోగులే జీతం చెల్లింపులో నెల ఆలస్యమైనా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోలా కాకుండా ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోంది. ప్రభుత్వం బియ్యం, నూనె సరఫరా  చేస్తుండగా రోజు కూరగాయలు కొనుగోలు చేసి కార్యకర్తలు భోజనం వండిపెట్టాల్సి ఉంది. దీంతో వీరికి ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. అలాగే ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలోని కొన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు చేతి నుంచి డబ్బు చెల్లించి పాలు పంపిణీ  చేస్తున్నారు.



ఈ ఏడాది మార్చి నుంచి వీరికి పాల బిల్లులు రావాల్సి ఉంది. జిల్లా పరిధిలో మొత్తం 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 3,268 అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు మరో 353 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తతోపాటు ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.4,200, ఆయాలకు రూ.2వేలు చొప్పున వేతనం చెల్లిస్తోంది.



ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది మార్చి నుంచి కేంద్రాలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అలాగే అర్బన్ ప్రాజెక్టుకు సంబంధించి 3 నెలల ఇంటిబాడుగలు మంజూరు కాలేదు. జిల్లాలోని 3,268 అంగన్‌వాడీ కేంద్రాలకుగాను సుమారు 2వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తుండటం గమనార్హం.



 బడ్జెట్ రాగానే చెల్లిస్తాం

 జిల్లా వ్యాప్తంగా అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని కార్యకర్తలు, ఆయాలకు ఆగస్టు నెల నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. బడ్జెట్ రాని కారణంగా జాప్యమవుతోంది. బడ్జెట్  రాగానే  వేతనాలు చెల్లిస్తాం. గతంలో ఎన్నడూ ఇలా జాప్యం జరగలేదు. ఇంటి అద్దెలు ఆయా ప్రాజెక్టుల వారీగా అందుబాటులో ఉన్న బడ్జెట్‌ను బట్టి చెల్లించారు.

 - లీలావతి, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరక్టర్



 వెంటనే బకాయిలు చెల్లించాలి

 అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతన బకాయిలతోపాటు ఇంటి బాడుగలు, మిగతా ఖర్చులను వెంటనే చెల్లించాలి. బిల్లుల చెల్లింపులో జాప్యం ఏర్పడటంతో చాలా మంది కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 - ఏ.రాణెమ్మ,

 అంగన్‌వాడీ కార్యకర్త

 

 ఐసీడీఎస్            అంగన్‌వాడీ

 ప్రాజెక్టులు            కేంద్రాలు

 కడప అర్బన్            186

 కడప రూరల్            341

 రాజంపేట                 209

 జమ్మలమడుగు        137

 రాయచోటి                287

 పులివెందుల            289

 ముద్దనూరు             129

 కమలాపురం           180

 లక్కిరెడ్డిపల్లె             315

 సిద్దవటం                  154

 రైల్వేకోడూరు            303

 పోరుమామిళ్ల           259

 ప్రొద్దుటూరు రూరల్   328

 ప్రొద్దుటూరు అర్బన్   196

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top