హత్య చేసి.. తగలబెట్టి..

హత్య చేసి.. తగలబెట్టి..


* చినరావుపల్లిలో దారుణం

* రంగంలోకి దిగిన పోలీసులు

* మృతుని వివరాలు సేకరణ..

* నిందితుల కోసం నాలుగు బృందాలు

* సంచలనం రేకెత్తించిన సంఘటన


ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురం పరిధిలోని చినరావుపల్లిలో దారుణం జరిగింది.గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేశారు. మృతదేహం సగంసగం కాలి గుర్తించడానికి వీల్లేకుండా ఉంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బుధవారం సాయంత్రం గ్రామంలో కాలిపోయిన గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు గ్రామ రెవెన్యూ అధికారి జరుగుళ్ల వెంకటరమణమూర్తికు తెలియజేయ గా అతని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం జేఆర్‌పురం సీఐ కె.అశోక్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు.



మృతదేహాన్ని వాహనంలో గోనె సంచిలో పెట్టి తీసుకొచ్చి బయటకు తీయకుండానే కిరోసిన్,పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని భావిస్తున్నారు. మృత దేహానికి నిప్పు అంటించాక నిందితులు అక్కడ నుంచి పరారై ఉంటారని చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం డీఎప్సీ కె.భార్గవ నాయుడు, క్లూస్ టీం కూడా సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. మృతదేహాన్ని పరిశీలించి తలపై గాయాలు ఉన్నట్టు డీఎస్పీ గుర్తించారు. క త్తితో నరికి చంపి ఉంటారని.. మృతి చెందిన వ్యక్తి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ నేర సంఘటనలో ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండి ఉంటుం ది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

దారి పక్కనే..

మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతం ఆర్‌అండ్‌బీ రహదారికి అనుకొని కిలోమీటరు దూరంలో ఉంది. ఆ పక్క నుంచే కాలిబాట ఉంది. ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి లావేరు మండలం బయ్యన్న పేట, మురపాక తదితర గ్రామాలకు ఈ దారి గుండా రాకపోకలు సాగి స్తారు. ఆ సమీపంలోనే షిర్డీసాయి ఆలయం కూడా ఉంది.

 

ఎక్కడా మిస్సింగ్ కేసులు లేవు..

ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల పోలీసుస్టేషన్ల పరిధిలో ఎక్కడ ఈ మధ్యకాలంలో అదృశ్యం కేసులు కూడా నమోదు కాలేదని డీఎస్పీచెప్పారు. మృత దేహం ఎవరిది అన్న మిస్టరీ వీడితే నిందితుల వివరాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు. మృతుని ఆచూకీ కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దహనం జరిగిన ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.   

 

ఇదే ప్రదేశంలో గతంలో పలువురి ఆత్మహత్య  

చినరావుపల్లి ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో గతంలో పలు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. వందల ఎకరాల్లో జీడిమామిడి తోటలు ఉండటం..జన సంచారం తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ ప్రేమ జంట ఇదే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే మరో ఇద్దరు జీడి మామిడి చెట్లకు ఊరిపోసుకుని మృతిచెందారు. జన సంచారం పెద్దగా లేని కారణంగా సంఘటన జరిగి రోజులు గడిచాక విషయం బయటకు వస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top