చెరో మాట.. చెరో బాట


అమలాపురం టౌన్ :పుష్కరాలకు మరో తొమ్మిది రోజులు మాత్రమే గడువుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంకా సమీక్షలు నిర్వహిస్తూ పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తొలి నుంచీ జూన్ 25కు పుష్కర పనులు పూర్తి కావాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ తేదీ వచ్చేసినా ఇంకా కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో గడువును జూన్ నెలాఖరుకు పొడిగించారు. అదీ సాధ్యం కాలేదు. పనుల జాప్యానికి గోదావరి వరద కొంత అవరోధమైంది. అయితే అంతకు ముందు నుంచే పనులు నత్తనడకగా సాగాయి. వరద ఆ జాప్యాన్ని మరింత పెంచింది. కోనసీమలోని బెండమూర్లంక, మురమళ్ల, గోడి, రావులపాలెం వంటి ఘాట్‌ల పనులు ఇంకా కొలిక్కి రాలేదు.

 

 కోనసీమ ఘాట్ల పనులు ఇంకా పూర్తి కాలేదని తెలుసుకున్న డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో శుక్రవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాలవారీగా పుష్కర పనులపై సమీక్షించినప్పుడు అధికారులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదన్న విషయం వెలుగు చూసింది. అధికారులు ఆయా నియోజకవర్గాల్లో పుష్కర పనుల తాజా పరిస్థితులపై ఎమ్మెల్యేలకు నివేదికలు ఇవ్వని వైనం కూడా చర్చకు రావటం గమనార్హం. తమ నియోజకవర్గంలో ఫలానా ఘాట్ పని ఎంతవరకూ వచ్చిందని ఒకరు, ఆ పనికి నిధులెన్ని పెట్టారని మరొకరు ప్రశ్నించారు. దీంతో పుష్కర పనులపై ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయం లేదన్న విషయాన్ని తేటతెల్లమైంది. దీనిపై అధికారులను రాజప్ప గట్టిగానే హెచ్చరించారు. పుష్కర పనుల వివరాలను ఆయా ఎమ్మెల్యేలకు కచ్చితంగా చెప్పాలని, వారిని స్వయంగా కలసి పనుల ప్రగతిని వివరించాలని ఆదేశించారు. పనులను ఎమ్మెల్యేలు పరిశీలించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

 

 జూన్ మొదటి వారంలో రాజప్ప కోనసీమలోని పలు ఫుష్కర ఘాట్ల పనులను స్వయంగా తనిఖీ చేశారు. పనుల జాప్యానికి కాంట్రాక్టర్లే కారణమని గ్రహించారు. ఒక్కో కాంట్రాక్టర్ 5 నుంచి 10 వరకూ పుష్కర పనులను తీసుకోవటంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయని గుర్తించి అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో పనుల జాప్యానికి ఇది ఓ కారణమైతే, ఇప్పుడు చివరి దశలో ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయ లోపం మరో కారణంగా కనిపిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం నుంచి విధిగా తమ ప్రాంతాల్లోని ఘాట్ల పనులను స్వయంగా పరిశీలించి, వేగిరం చేయాలని సూచించారు. ఏది ఏమైనా పుష్కర పనులపై అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ప్రత్యేక దృష్టి పెడితేనే స్వల్ప వ్యవధిలో అవి పూర్తయ్యే అవకాశముంటుంది. ఆదివారం జరిగే జెడ్పీ సమావేశం కూడా పూర్తిగా పుష్కర అజెండాతోనే సాగనుంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు ఈ కొద్ది రోజులూ పూర్తిగా పుష్కర పనులపైనే దృష్టి కేంద్రీకరించనున్నారని తెలిసింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top