భూగర్భ జలాలు అడుగంటాయ్


ఏలూరు (మెట్రో) : పశ్చిమగోదావరి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రైతు భూగర్భ జలాలు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించినందుకు గుర్తుగా పెదవేగి మండలం ముండూరులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం పోలవరం కుడికాలువ మీదుగా ఉన్న మార్గంపై ప్రయాణించి సుమారు 25 కిలోమీటర్ల మేర సాగుతున్న పనులను పరిశీంచారు. గుండేరు, జానంపేట అక్విడెక్ట్ నిర్మాణాలను పరిశీలించారు.

 

 ఈ సందర్భంలో వంగూరులో ఏర్పాటు చేసిన నీరు-ప్రగతి చర్చాగోష్టిలో మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జాలాలు 19.3 మీటర్ల లోతుకు వెళ్లాయని, ఇది ఆందోళన చెందాల్సిన విషయమని అన్నారు. అనంతపురం జిల్లాతో సమానంగా పశ్చిమలోనూ నీటి ఎద్దడి తలెత్తనుందన్నారు. మెట్ట ప్రాంతంలో ఆయిల్‌పామ్ సాగులో ఉందని, దీనికి నీటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వరి, కొబ్బరి, మొక్కజొన్న వంటి పంటలతోపాటు ఆక్వా సాగు కూడా ఎక్కువగానే ఉందన్నారు.

 

  ఈ నేపథ్యంలో రైతులు పంటల కోసమే కాకుండా.. నీటి వనరుల పొదుపుపైనా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో నీటి సమస్య తలెత్తుతోందని చెబుతూనే.. గోదావరి జలాలతోపాటు రామిలేరు, తమ్మిలేరు జలాలను కూడా కృష్ణా జిల్లాకు తరలిస్తామని చెప్పుకొచ్చారు. గత ఏడాది నీరు-చెట్టు కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించారని, ఏ ఏడాది కూడా కాలువలు, చెరువలు పూడికతీత పనులకు ఎన్ని యంత్రాలైనా ఉపయోగిస్తామన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్ రైతులను ఆదుకుంటామని, ఇందుకోసం కేంద్రంతో చర్చించామని చంద్రబాబు చెప్పారు.

 

 భూసేకరణే అసలు సమస్య

 జిల్లాలో అభివృద్ధి పనులకు భూసేకరణ సమస్య అడ్డంకిగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ దృష్ట్యా దూబచర్ల వద్ద అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇది విజయవంతం అయితే జిల్లాకు మరికొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్, కుడికాలువ నిర్మాణాలు పూర్తయ్యేందుకు 20, 30సార్లైనా పర్యటిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, ఆరిమిల్లి రాధాకృష్ణ, పితాని సత్యనారాయణ, గన్ని వీరాంజనేయులు, పులపర్తి రామాంజనేయులు, కలువపూడి శివ, అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, కలెక్టర్ కాటంనేని భాస్కర్, మేయర్ షేక్ నూర్జహాన్ ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top