చంద్రబాబువి నీచరాజకీయాలు


 రాజాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నీచ రాజకీయాలను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మాలమహానాడు, సర్వజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ అన్నారు. ఎన్నికల ముందు పూర్తిగా మారిపోయానని చెప్పుకొచ్చిన ఆయన ఏడాది పాలనలోనే తన నీచ రాజకీయాలు బయటపడుతున్నాయని మండిపడ్డారు. రాజాంలో శుక్రవారం సంఘ ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ జంక్షన్‌లో మానవహారం చేపట్టి ధర్నా చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాలమాదిగలంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటే ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి జీవో నంబర్ 25ను విడుదల చేసి సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి వారి మధ్య చిచ్చురేపుతున్నారని దుయ్యబట్టారు.

 

  ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఎస్సీ సంక్షేమ పథకాల్లో భాగంగా అమలులో ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెడతానని చెప్పి జీవో విడుదల చేయడాన్ని మాలమహానాడు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చంద్రబాబు కుటిల రాజకీయాలపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. స్వార్ధ రాజకీయాల కోసం మాలమాదిగల మధ్య చిచ్చురేపడం సరికాదన్నారు. అగ్రవర్ణ పేదలకు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలన్నారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శీతల్, రాజేష్, బత్తిన మోహనరావు, జిల్లా కార్యదర్శి గుడబండి సూర్యనారాయణ, విజయనగరం జిల్లా ఇన్‌చార్జి తిరుపల్లి శ్రీనివాస్, గవరయ్య, జిల్లా సమన్వయ కర్త పతివాడ చిన్నారావు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top