భగ్గుమన్న విభేదాలు

భగ్గుమన్న విభేదాలు - Sakshi


సాక్షి ప్రతినిధి, అనంతపురం :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 24న జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంలోనే టీడీపీలో గ్రూపు తగాదాలు బట్టబయలయ్యాయి. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మధ్య దూషణల పర్వం చోటు చేసుకుంది.

 

 ప్రభాకర చౌదరి ఏర్పాటు చేసిన సమావేశం జేసీ ప్రభాకరరెడ్డి వీరంగంతో విచ్ఛిన్నమయ్యింది. ఇప్పటికే గ్రూపులుగా విడిపోయిన టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు రాబోయే రోజుల్లో తారస్థాయికి చేరనుందనేందుకు ఈ సంఘటన సంకేతంగా నిలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ైవైఎస్సార్‌సీపీలో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ మాసూంబాబాలను అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వారి చేరిక కోసం మంగళవారం స్థానిక లలిత కళాపరిషత్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు.

 

 రషీద్ అహ్మద్, మాసూంబాబా గత ఎన్నికల్లో జేసీ దివాకరరెడ్డిని ఓడించేందుకు చురుగ్గా పనిచేశారని, జేసీ వ్యతిరేకులను అనంతపురం ఎమ్మెల్యే పనిగట్టుకుని టీడీపీలోకి తీసుకొస్తున్నారన్న సమాచారంతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి మందీ మార్బలంతో అక్కడికి చేరుకున్నారు. ‘మా అన్న (జేసీ దివాకరరెడ్డి) అనంతపురం పార్లమెంటు సభ్యుడు. ఈ పార్లమెంటు పరిధిలో కొత్త వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే ముందు మాకు మాటమాత్రమైనా చెప్పాల్సిన అవసరం లేదా? అంతా నీ ఇష్టమేనా? వారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటావో చూస్తా. అసలు వారిని పార్టీలోకి చేర్చుకునే అధికారం నీకెవరిచ్చారు?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రభాకర చౌదరిని నిలదీశారు.

 

 అదే సమయంలో పార్టీలోకి చేరడానికి వచ్చిన రషీద్ అహ్మద్, మాసూంబాబాలను బూతులు తిట్టారు. ‘ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా చేయాల్సిందల్లా చేసి ఇప్పుడు పార్టీలో చేరతారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే మీ సంగతి చూస్తాన’ంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దీంతో ఆ ఇద్దరు మైనార్టీ నాయకులు మెల్లగా జారుకున్నారు. అనంతపురం నియోజకవర్గంలో.. మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ వర్గాలపై దర్పం ప్రదర్శించే ప్రభాకర చౌదరి చివరకు మౌనంగా ఉండిపోయారు. ఈ లోపు జేసీ అనుచరులు సమావేశంలో ఉన్న కుర్చీలు విసిరేయడం.. ఫ్లెక్సీలు చించేయడం లాంటి పనులు కానిచ్చేశారు. ‘పార్లమెంటు పరిధిలో మాకు తెలియకుండా ఎవరైనా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఖబడ్దార్’ అంటూ  ప్రభాకర రెడ్డి అక్కడి నుంచి నిష్ర్కమించారు. తర్వాత ప్రభాకర చౌదరి విలేకరులతో మాట్లాడుతూ సమస్యను అధినేత చంద్రబాబుకు వివరించి ఆయన అనుమతితో మైనార్టీనేతలను పార్టీలో చేర్చుకుంటామని క్లుప్తంగా మాట్లాడి వెళ్లిపోయారు.

 

 పట్టు కోసమే...

 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారిన జేసీ సోదరులు తాడిపత్రి అసెంబ్లీతో పాటు అనంతపురం పార్లమెంటు సీటు కూడా గెలుచుకున్నారు. ఇవిగాక జిల్లాలో మరో మూడు.. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ వర్గీయుల గెలుపునకు దోహదపడ్డారు. ఈ కారణంగానే జిల్లాలో టీడీపీ అత్యధికంగా 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగల్గిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

 

 ఇంత చేసినా జిల్లాలో తమకు చంద్రబాబు సముచిత స్థానం ఇవ్వలేదన్న భావన జేసీ వర్గీయుల్లో ఉంది. తమ ప్రాబల్యమున్న అనంతపురం పార్లమెంటు పరిధినే అధినేత పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.  రెండు మంత్రి పదవులూ హిందూపురం పార్లమెంటు పరిధిలోని పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిలకే ఇచ్చారు. మరోవైపు అధినేత చంద్రబాబు బావమరిది బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

 

 చంద్రబాబు రెండు రోజుల జిల్లా పర్యటన కూడా  హిందూపురం పార్లమెంటు పరిధిలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకే పరిమితం చేయడం గమనార్హం. కనీసం అనంతపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనైనా తాము పట్టు సాధించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందన్న భావన జేసీ వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర చౌదరిని కట్టడి చేయడంపై జేసీ వర్గం దృష్టి కేంద్రీకరించిందని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో తొలి నుంచీ జేసీకి ప్రభాకర చౌదరి ప్రత్యర్థే. ఇటీవలి కాలంలో ప్రభాకర చౌదరి తన పార్టీకే చెందిన నగర మేయర్ స్వరూపకు పలు అడ్డంకులు కలగజేస్తున్నారు. వాస్తవానికి స్వరూప నగర మేయర్ కావడానికి జేసీ సోదరుల ఆశీస్సులు కూడా ఉన్నాయి. మేయర్ స్థానాన్ని అస్థిరపరిచే విధంగా కార్పొరేషన్ వ్యవహారాల్లో ఎమ్మెల్యే జోక్యం ఎక్కువవుతోందన్న విమర్శలూ ఉన్నాయి. ఈ తరుణంలో ఎమ్మెల్యే కార్యకలాపాలను కట్టడి చేయకపోతే.. భవిష్యత్‌లో అనంతపురం పార్లమెంటు పరిధిలో తమ పట్టు చేజారిపోయే ప్రమాదముం దని భావించే జేసీ ప్రభాకర రెడ్డి మంగళవారం ఈ చర్యకు ఉపక్రమించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

 

 ‘ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పని చేసినవారిని పార్టీలో చేర్చుకోకూడదంటున్న జేసీ సోదరులు కూడా నిన్న మొన్నటి దాకా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారే కదా..’ అని సంప్రదాయక టీడీపీ వర్గాలు లేవనెత్తుతున్న తర్కానికి సమాధానం... ఆధిపత్య పోరులో తర్కానికి తావుండదనే. జిల్లా తెలుగుదేశం పార్టీ.. పరిటాల, జేసీ వర్గాలుగా విడిపోయిన సందర్భంలో మంగళవారం నాటి సంఘటన ఇప్పటికే ఉన్న గ్రూపుల పునరేకీకరణకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top