పంచాయతీ కార్మికుల కడుపు కొట్టొద్దు

పంచాయతీ కార్మికుల  కడుపు కొట్టొద్దు - Sakshi


అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

 

తిరుపతి రూరల్:చిత్తూరు జిల్లాలో పంచాయతీ కార్మికులను ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదనను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తారు. సోమవారం శాసనసభలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. 15 నుంచి 20 సంవత్సరాలుగా పంచాయతీల్లోని పారిశుధ్య కార్మికులు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పగలూరాత్రి పని చేస్తున్నారని తెలిపారు. మురుగు కాలువలు, రోడ్ల శుభ్రత, ఇతర పనులు ఏ మాత్రం సంకోచించకుండా తమ సొంత పనిలా, చాలీచాలని జీతాలు తీసుకుని చిత్తూరు జిల్లా పంచాయతీ కార్మికుల పనిచేస్తున్నారన్నారు. రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించి కొత్త కాంట్రాక్టు వ్యవస్థ తీసుకొచ్చి, పంచాయతీల్లో కొత్తవారిని నియమిస్తామని కలెక్టర్ ఆదేశాలివ్వడం దురదృష్టకరమన్నారు. పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి, కనీస ఉద్యోగ భద్రత కల్పించాల్సిన కలెక్టర్ తాను తెలంగాణా రాష్ట్రానికి వెళ్లిపోతున్నాననే ఉద్దేశంతో కార్మికులందరిని ఇంటికి పంపించాలనుకోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి పుట్టిన జిల్లాలో ఇలా జరగడం ఆయనకే తలవంపులు తెస్తుందన్నారు. ఇలాగే జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును జిల్లా చరిత్ర క్షమించదన్నారు. కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోమని, వారికి అండగా నిలుస్తామని, వారితో కలసి వీధి పోరాటాలకైనా, న్యాయ పోరాటాలకైనా సిద్ధమని హెచ్చరించారు.



తెలుగు భాషను కాపాడండి



ఆయన మరో అంశంపై మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల ముందు పుట్టిన ప్రాచీన భాష తెలుగు అని తెలిపారు. ఏడు వేల పదాలతో ఏర్పడ్డ తెలుగు ప్రస్తుతం 1500 పదాలకు దిగజారిందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు సైతం తెలుగులో తీర్పులిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తెలుగును కాపాడడానికి మరింత ప్రయత్నం చేయూలన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే ఉండేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. నిన్న ప్రవేశపెట్టిన సీఆర్‌డీఏ బిల్లులో తెలుగును చూస్తే బాధ వేస్తుందన్నారు. తెలుగు కన్నా ఇంగ్లీషు నయమనుకునేలా భాష ఉందన్నారు. తెలుగును ఇలావాడి ఆ భాష ప్రతిష్టను, గౌరవాన్ని తగ్గించొద్దని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు, కేరళల్లో వారి భాషలను ఎలా కాపాడుకుంటున్నారో అదేవిధంగా తెలుగుకు సైతం రాష్ట్రంలో అదే ప్రాధాన్యతనిచ్చి కాపాడాలని కోరారు.

 

వికలాంగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి

 

అభాగ్యులైన వికలాంగులు ఆర్డీవో కార్యాలయం ఎదుట 15 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నో వ్యయప్రయూసలకు ఓర్చి ఇన్ని రోజులుగా వారు ధర్నా చేస్తున్నా కనీసం సమస్య తెలుసుకుని పరిష్కరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాలేదా అని ప్రశ్నించారు. వికలాంగులకే న్యాయం చేయకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒక్క అధికారి అరుునా వారి వద్దకు వెళ్లి సమస్య తెలుసుకున్నారా అని మండిపడ్డారు. దయ చేసి వెంటనే వారి సమస్యను తెలుసుకోవాలని కోరారు. వారిని పట్టించుకోకుంటే వారి శాపాలు ప్రభుత్వానికి తగులుతాయని పేర్కొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top