‘మిలాన్’ మోసం


* రూ.3 కోట్లతో యాజమాన్యం పరారు

* వెండి, బంగారు నాణేల ఆశ చూపి మాయ

* కార్యాలయం సీజ్ చేసిన పోలీసులు


పలాస: కాశీబుగ్గ గాంధీనగర్‌లోని మిలాన్ అండ్ మిలాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. వెండి, బంగారు నాణేలు ఆశ చూపి ఖాతాదారులకు మోసం చేసింది. కాశీబుగ్గ బ్రాంచిని నడిపించిన మేనేజర్, ఇతర సిబ్బంది సుమారు రూ.3 కోట్లుతో పరారయ్యారు. బాధితులంతా లబోదిబోమం టూ పోలీసులను ఆశ్రయించారు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ గురువారం తన సిబ్బందితో కలసి కాశీబుగ్గలోని మిలాన్ సంస్థ కార్యాలయాన్ని తెరిచి అందులోని రికార్డులను స్వాధీ నం చేసుకున్నారు.



అనంతరం కార్యాలయాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్ ప్రధా న కేంద్రంగా కిషోర్ సమ్మాల్, బింకన్ చరణ్ లింకా, జగదీష్ సారంగి తదితరులు మిలాన్ అండ్ మిలాన్ ఫైనాన్స్ సంస్థను నడిపిస్తూ 2012లో కాశీబుగ్గలో బ్రాంచి ఏర్పాటు చేశారు. అప్పటికే కాశీబుగ్గలో పేరుమోసిన ఒక చిట్స్ అండ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేసిన నిచ్చెర్ల చం ద్రశేఖరరావును బ్రాంచి మేనేజర్‌గా నియమిం చారు.



ఆయన కింద ఏజెంట్లుగా శివప్రసాద్, పి.జయరాం, నరేష్‌కుమార్, బి.సురేష్‌కుమార్ తదితరులను నియమించి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ రెండేళ్లలో 1000 మంది ఖాతాదారుల నుంచి సుమారు రూ.3 కోట్లు సేకరిం చారు. రూ.1000 డిపాజిట్ చేస్తే రూ.750 విలువ గల 10 గ్రాముల వెండి నాణెంను ఇవ్వడం ప్రారంభించారు. అలాగే రూ.25 వేలు డిపాజిట్ చేసినట్లయితే 5 గ్రాముల బంగారు నాణెం ఇస్తూ వచ్చారు. ఈ విధంగా వెండి, బంగారు నాణేల ఆశ చూపించి డిపాజిట్లు భారీగా సేకరించారు.

 

ఆరు నెలల క్రితమే బ్రాంచి మేనేజరు పరారు

సేకరించిన డిపాజిట్ల మొత్తాలను రెండేళ్ల తరువాత ఖాతాదారులకు చెల్లించాల్సి ఉంది. గడువు సమీపించడంతో బ్రాంచి సిబ్బంది మెల్లగా ఎవరి మట్టుకువారు జారుకున్నారు. డిపాజిట్లు తిరిగి చెల్లించాల్సి రావడం, వాటిని ఖాతాదారులకు ఇవ్వడానికి నగదు తన వద్ద లేకపోవడంతో బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్ 6 నెలల క్రితమే బ్రాంచ్ కార్యాలయం నుంచి పరారయ్యారు. విశాఖపట్నంలోని తన అత్తవారి ఇంటి వద్ద ఉన్నట్టు తెలుసుకున్న ఏజెంట్లు ఫోన్ చేసినా సరైన సమాధానం లేకపోవడంతో ఆరా తీశారు.



మరికొన్నాళ్లకు ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయామని డిపాజిట్ దారులు గ్రహించారు. బ్రాంచి కార్యాలయం ఉన్న భవనానికి కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని భవనాన్ని ఖాళీచేయమని కార్యాలయంలోని సిబ్బందికి చెప్పారు. అయినా వారు చెల్లించలేకపోవడంతో ఇంటి యజమాని కార్యాలయానికి తాళం వేసినట్లు తెలిసింది. ఈ విధంగా పూర్తిగా మూతపడడంతో కార్యాలయానికి వచ్చిన ఖాతాదారులు ఆందోళన చెందారు. ఏజెంట్లును ఆశ్రయించినా చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఏజెంట్లు శివప్రసాద్, పి.జయరాం తదితరులతో పాటు ఖాతాదారుడు కె.సురేష్‌కుమార్ కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.



కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ గురువారం మిలాన్ సంస్థ కార్యాలయం తాళం తీసి అందులోని రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. పలాస ఆర్‌ఐ రవికుమార్, వీఆర్‌ఓ కృష్ణమూర్తి సమక్షంలో కార్యాలయాన్ని పరిశీలించి తర్వాత సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ విలేకరులతో మాట్లాడుతూ ఏజెంట్లు..డిపాజిట్‌దారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఖాతాదారులు, ఏజెంట్లు ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 1000 మంది నుంచి దాదారు రూ.3 కోట్లు సేకరించినట్లు తెలుస్తోందన్నారు.

 

వెబ్‌సైట్ రూపొందించి మరీ మోసం..

మిలాన్ సంస్థ ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌ను రూపొందించి సేకరించిన డిపాజిట్లను పశువులు, గొర్రెలు, వ్యవసాయం, రియల్‌ఎస్టేట్ వ్యాపారం, విద్యా, పట్టు పరిశ్రమ తదితర రంగాల్లో పెట్టుబడులుగా పెట్టి వచ్చిన ఆదాయాన్ని మదుపుదారులకు ఇస్తామని నమ్మకం చూపింది. పలాసలోనే కాకుండా టెక్కలి, పర్లాకిమిడి, సోంపేట, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కూడా తమ బ్రాంచీలు ఉన్నాయని ఖాతాదారులు నమ్మించి డిపాజిట్లు సేకరించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top