100 గ్రామాలకు నగర శోభ!

100 గ్రామాలకు నగర శోభ!


ఏపీ రాజధాని చుట్టూ భూములిచ్చే రైతులకు అభివృద్ధిలో భాగస్వామ్యం

 

విజయవాడ బ్యూరో: రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు రాజధానిగా మాత్రమే కాకుండా అన్ని రంగాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ‘గ్రోత్ సెంటర్’గా బెజవాడ నగరాన్ని అభివృద్ధి పర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఐటీ, పరిశోధన, కార్పొరేట్ సంస్థల ఏర్పాటుకు అవసరమైన కోట్లాది రూపాయల పెట్టుబడులు రావడానికి అనుగుణంగా.. రాజధాని నగర రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం నిపుణులతో చర్చించి నగర నిర్మాణం, అందులో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, నిర్మించాల్సిన భవన సముదాయాలు, సేకరించాల్సిన భూములపై కసరత్తు మొదలు పెట్టింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమైన రాజధాని సలహా కమిటీ వివిధ అంశాలపై సమగ్రంగా సమీక్షించినట్లు సమాచారం. నాలుగు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్ రాష్టంలోని నయా రాయ్‌పూర్ నగరాన్ని సందర్శించిన కమిటీ నగర రూపకల్పన, వివిధ నిర్మాణాలకు జరిగిన వ్యయంపై వివరాలను సేకరించారు. విజయవాడ చుట్టూ చేపట్టాల్సిన నిర్మాణాలు, సమీకరించాల్సిన భూములపై స్పష్టతకు వచ్చారు. దీన్నిబట్టి చూస్తే విజయవాడ, దాని పరిసరాల్లో నిర్మితమయ్యే రాజధాని చుట్టూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న సుమారు వందకు పైగా గ్రామ పంచాయతీలు నగర శోభను సంతరించుకోనున్నాయి.



ఆయా గ్రామాల చుట్టూ ఉన్న భూములను సేకరించిన తర్వాత రైతుల భాగస్వామ్యంతో రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను మెరుగుపర్చి నగరంతో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అమల్లోకి వస్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లోని గ్రామాలు, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, కొండపల్లి, పరిటాల, గుంటుపల్లి, గొల్లపూడి, కొటికలపూడి, కొత్తపేట, దాములూరు, నున్న పరిసర గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలుస్తోంది. రెండు జిల్లాల్లోనూ (ప్రకాశం బ్యారేజీకి ఎగువన) నదికి ఇరువైపులా 12,500 ఎకరాల భూములను గుర్తించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 4 దశల్లో భూసేకరణ సాగుతుందని అధికారుల అంచనా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top