ఘరానా మోసం

ఘరానా మోసం


- ఉద్యోగాల పేరిట రూ.1.80 కోట్ల వసూలు

- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

- పోలీసుల అదుపులో సీఏఈఎఫ్‌ఎం జీఎం, సీఈఓ

అనంతపురం క్రైం :
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఘరానా మోసానికి దిగారు. నిరుద్యోగల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేశారు. రేపు మాపు అంటూ ఆరు నెలల తిప్పారు. అనుమానం వచ్చిన బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయపడింది. బాధితులు, త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హెచ్చెల్సీ కెనాల్ సమీపంలో కొంత మంది   కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అండ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (సీఏఈఎఫ్‌ఎం) అనే సంస్థ స్థాపించారు. ఈ సంస్థకు ఎన్.జ్యోతిప్రసాద్‌రెడ్డి (చైర్మన్), సాధిక్‌వలి (జీఎం), ఎం.కృష్ణ (సీఈఓ) ముగ్గురూ కలసి పంగల్‌రోడ్డులోని టీటీడీసీలో జనవరిలో సుమారు 324 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు జరిపారు. ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.25 వేలు నుంచి రూ.60 వేల వరకు వసూలు చేశారు.



ఇలా సుమారు రూ.1.80 కోట్లు వసూలు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకమని, ఇందులో ఉద్యోగం చేస్తే భవిష్యత్తులో పర్మినెంట్ అవుతాయని నమ్మబలికారు. ఎంపికైన అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి రైతులకు సేంద్రియ ఎరువుపై అవగాహన కల్పించి, రైతులకు కావాల్సిన విత్తనాలు, మొక్కలు, ఎరువులు, పరికరాలు ఉచితంగా అందజేస్తామని నమ్మబలికారు. ఫీల్డ్ ఆఫీసర్లు, అసిస్టెంట్, కార్యాలయ సిబ్బంది ఇలా ఉద్యోగాలను కేటగిరిగా విభజించారు. రూ.8 వేల నుంచి రూ.16వేల వరకూ వేతనాలు ఇస్తామన్నారు. ఆరు నెలల నుంచి వేతనం ఇవ్వకపోవడంతో తమకు వేతనాలు ఇవ్వాలని 15 రోజుల నుంచి ఉద్యోగులు వారిపై ఒత్తిడి పెంచారు.



దీంతో సంస్థ నిర్వాహకులు, ఉద్యోగుల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. జీఎం సాధిక్‌వలి, సీఈఓ కృష్ణలు ఉద్యోగులపై త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి జరిగిన విషయంపై ఆరా తీయగా ఘరానా మోసం బైటపడింది. బాధితులు త్రీటౌన్ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో పోలీసులు కృష్ణ, సాదిక్‌వలిలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆ సంస్థ చైర్మన్ ప్రసాద్‌రెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మోసపోయిన వారిలో ఆటో డ్రైవర్లు, మేస్త్రీలు, టైలర్లు ఉండడం విశేషం. దీని వెనకు అధికార హస్తం ఉంది: - కె.పెద్దిరెడ్డి, సీపీఎం  రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈ తతంగం వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది. వారి అండదండలతోనే ప్రసాద్‌రెడ్డి ఈ సంస్థను నెలకొల్పాడు.  పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలి.

 

ఆటో అమ్మి డబ్బులు కట్టా: సి.రమేష్, ఆటో డ్రైవర్

నా భార్య ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంది. నేను ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. అయితే నా భార్య కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుందని ఆటో ఆమ్మి రూ.40 వేలు కట్టా. మోసం జరుగుతోందని అనుమానం వచ్చి కంపెనీ వారిని నిలదీశాం. రూ.40 వేలకు సంబంధించి చెక్ ఇచ్చారు. బ్యాంక్‌కు వెళ్లి చూస్తే ఖాతాలో డబ్బులు లేవు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top