కేబినెట్‌లో మార్పులు!

కేబినెట్‌లో మార్పులు! - Sakshi


జపాన్ పర్యటనకు ముందే  సీఎం సంకేతాలు

గోదావరి పుష్కరాల తర్వాత ముహూర్తం.. కొందరికి ఉద్వాస


 

 హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గోదావరి పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల తొలివారంలో ఈ మార్పుచేర్పులు చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం జపాన్ దేశంలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడికి వెళ్లడానికి ముందు కేబినెట్‌లో మార్పుచేర్పులపై ముఖ్యులకు సంకేతాలిచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావడం, కొందరు మంత్రులు అనుకున్న స్థాయిలో పనిచేయకపోవడం, మండలికి కొత్తగా ఎంపికైన పలువురిని కేబినెట్‌లో చేర్చుకుంటానని ఇదివరకే చెప్పిన నేపథ్యంలో ఆయన మార్పుచేర్పులపై కసరత్తు చేశారు. మంత్రుల పనితీరును వివిధ రకాల సర్వేల ద్వారా అధ్యయనం చేయించిన బాబు కొందరిని తప్పించాలన్న ఆలోచనకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న వారందరినీ యధాతథంగా కొనసాగించాలని అనుకున్నా కొత్తగా మరో ఆరుగురిని కేబినెట్‌లో చేర్చుకోవడానికి అవకాశాలున్నాయి. పైగా కీలకమైన విద్యుత్, పరిశ్రమలు, న్యాయ, మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ సంస్థలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలన్నీ సీఎం అధీనంలోనే ఉన్నాయి.



కొత్తవారికి ఈ శాఖలు కేటాయించాలని గతంలోనే ఒక ఆలోచనకు వచ్చినా మండలి ఎన్నికలు కారణంగా వాయిదా వేశారు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున మైనారిటీ వర్గాలకు చెందిన వారెవరూ విజయం సాధించకపోవడంతో కేబినెట్‌లో ఆ వర్గాలకు ప్రాతినిథ్యం కూడా లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నేత ఎం.ఎ.షరీఫ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కొత్తగా కేబినెట్‌లో చేర్పించుకునేవారిలో ఎక్కువమంది ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిబంధనల మేరకు గరిష్టస్థాయిలో కేబినెట్ ఏర్పాటు చేయడం, ఎవరెవరిని చేర్చుకోవడం వంటి అంశాలపై గోదావరి పుష్కరాల అనంతరం దృష్టిసారిస్తారని సన్నిహితవర్గాలు చెప్పాయి. కొందరిని తప్పించడంతోపాటు కొందరి శాఖల్లో మార్పు లు చేయనున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎం.ఎ. షరీఫ్, గుమ్మడి సంధ్యారాణి. గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరుల్లో ముగ్గురికి కేబినెట్‌లో చోటు ఖాయమని అంటున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top