‘మార్పు’ ఎక్కడ..?


  •   రెండేళ్లుగా జిల్లాలో అమలు

  •   అయినా.. తగ్గని మాతా శిశు మరణాలు

  •   జిల్లాలో భయపెడుతున్న దారుణాలు

  •   మూడు నెలల్లో 14మంది గర్భిణులు మృతి

  •   అధికారులూ.. మారాలి మరి..

  • విజయవాడ : గత మే నెలలో మొవ్వ మండలం వక్కలగడ్డకు చెందిన బండారు లక్ష్మి ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అప్పటికే ఆమె తీవ్ర బలహీనంగా ఉండటంతో వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించి ఆపరేషన్ చేశారు. అనంతరం పరిస్థితి విషమించి మృతిచెందింది. గర్భిణీ సమయంలో పౌష్టికాహారం తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని నిపుణుల వాదన.

     

    పదిరోజుల కిందట ముదినేపల్లి పీహెచ్‌సీలో స్టాఫ్ నర్సుగా పనిచేసే శైలజ ప్రసవం కోసం వెళ్లగా, ఆమెకు చేసిన సిజేరియన్ వికటించి మృతిచెందింది. ఈ ఘటనలో ఆపరేషన్ చేసింది ప్రభుత్వ వైద్యురాలే కావడం గమనార్హం.

     

    తాజాగా గుడివాడకు చెందిన పావని ఎనిమిది నెలల గర్భంతో ప్రభుత్వాస్పత్రికి రాగా, ఆమెకు సకాలంలో చికిత్స అందక మృతిచెందింది. ఆమెకు బ్లడ్ ప్రజర్ ఎక్కువగా ఉన్నా.. ఆరోగ్య కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

     

    కేవలం వీరే కాదు.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జిల్లాలో దాదాపు 14మంది గర్భిణులు ఇలాగే మృతిచెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు జిల్లాలో రెండేళ్లుగా ‘మార్పు’ పథకం అమలుచేస్తున్నా ఎటువంటి ప్రయోజనం కనిపించట్లేదు. ఈ పథకం నిబంధనలు కచ్చితంగా అమలుచేయాల్సిన అధికారులు కాకి లెక్కలు వేస్తూ కాలం గడుపుతున్నారు.



    దీంతో మాతాశిశువు మరణాల్లో ఎటువంటి మార్పు రాకపోగా ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి. దక్షిణ భారతదేశంలోనే మన రాష్ట్రం శిశువుల మరణాల్లో మొదటి స్థానంలో, మాతా మరణాల్లో రెండో స్థానంలో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్న విషయం తెలిసిందే. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

     

    రక్తహీనతే పెను సమస్య..

     

    జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తున్న గర్భిణులు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. ఒక్కొక్కరూ హిమోగ్లోబిన్ ఐదు, ఆరు గ్రాముల శాతంతో వస్తున్నారని వైద్యులే చెబుతున్నారు. అటువంటి వారికి ప్రసవం చేయడం కష్టంగా మారుతోందని, ఒక్కొక్కరికీ నాలుగు, ఐదు రక్తం బ్యాగ్‌లు ఎక్కించాల్సి వస్తోందంటున్నారు. అలాంటి వారికి పుట్టే శిశువులు తక్కువ బరువుతో ఉంటున్నారని, కొన్ని సందర్భాల్లో శిశు మరణాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. గర్భిణీ సమయంలో సరైన పోషకాహారం అందకపోవడం వల్లే ఇలా జరుగుతోందని పేర్కొంటున్నారు. ‘మార్పు’ పథకం లక్ష్యమైన పౌష్టికాహారం అందజేత అసలు అమలు కావట్లేదు. ఇప్పటికైనా ఆ పథకాన్ని అమలుచేసి మాతా శిశు మరణాలను తగ్గించేందుకు కృషి  చే యాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు.

     

    లక్ష్యం.. నిర్లక్ష్యం..



    మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా 2012 అక్టోబర్‌లో మన జిల్లాలో మార్పు పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ఈ పథకంలో భాగంగా జిల్లాలో గర్భిణులను గుర్తించి, వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రసవం ఆస్పత్రిలోనే జరిగేలా చూడాలి. కానీ, ఇలాంటి చర్యలు జిల్లాలో ఎక్కడా అమలు కావట్లేదు. సగానికిపైగా ఆరోగ్య కేంద్రాల్లో నెలకు పది కూడా ప్రసవాలు జరగట్లేదు. అంతేకాదు.. రెండు, మూడు పీహెచ్‌సీల్లో నెలలో ఒక్క ప్రసవం కూడా జరగట్లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మాతా శిశు మరణాలను ఎలా అరికట్టగలరని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top