ధర్మానికే ఓటెయ్యండి


నంద్యాల ప్రజలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

- వ్యవస్థలో మార్పు...నంద్యాల నుంచి ప్రారంభం కావాలి  

నంద్యాల అభివృద్ధి నాకు వదిలేయండి  

నవరత్నాలకూ ఇక్కడి నుంచే నాంది 




నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయండి.. రాబోయే రోజుల్లో నవరత్నాల వెలుగులకు నంద్యాల నుంచే నాంది పలకండి’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఇవాళ మూడున్నర సంవత్సరాల తర్వాత చంద్రబాబు పరిపాలకు తీర్పు ఇవ్వబోతున్నాం. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా మీరు ఓటు వేయబోతున్నారు. ఆయన చేసిన అవినీతికి, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత లేకపోతే ప్రజా స్వామ్యం దిగజారిపోతుంది. ఎన్నికలప్పుడు హామీలిచ్చి, తర్వాత మోసం చేసే నాయకులను ప్రజలు కాలర్‌ పట్టుకుని నిలదీసే రోజు రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.’ అని జగన్‌ పేర్కొన్నారు. ‘మీ దగ్గరకు డబ్బు మూటలతో వస్తారు.. రూ. 5వేలు చేతిలో పెట్టి జేబులో నుంచి దేవుడి బొమ్మ తీస్తారు.. అది చూపించి ప్రమాణం చేయమంటారు.  



ఆ క్షణంలో  ఒక్కసారి కళ్లు మూసుకు ని దేవుడా.. ధర్మం వైపు ఉండేలా చూడమని ప్రార్థించండి. ఏ దేవుడైనా పాపానికి ఓటు వేయమని చెప్పడు.. దెయ్యాలు మాత్రమే అలా అడుగుతాయి. రేపు ఆ దెయ్యాలు వస్తాయి.. జాగ్రత్తగా ఉండండి. ధర్మానికి.. న్యా యానికి ఓటేయండి’ అని ఆయన నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌ సోమవారం నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్‌ వద్ద ఉప ఎన్నికల ముగింపు ప్రచార సభలో  మాట్లాడారు. నంద్యాల ప్రజలు తనపై చూపిస్తోన్న ప్రేమానురాగాలను చూసి చంద్రబాబు వెన్నులో భయంపుట్టిందని, అందుకే అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. నంద్యాల అభివృద్ధి బాధ్యతను తనపై ఉంచి.. నీతిని, ధర్మాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సభలో ఇంకా ఆయన ఏమన్నారంటే.... 

 

నంద్యాల నుంచే నవరత్నాలు 

మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నవరత్నాల పథకాల అమలుకు నంద్యాల నుంచే శ్రీకారం చుడతా. ప్రతి ఇంటికి పథకాలు చేరాలంటే వ్యవస్థలో మార్పు రావాలి. నంద్యాలను జిల్లాగా చేస్తా. జిల్లాకేంద్రం అయితే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, వివిధ జిల్లాస్థాయి కార్యాలయాలు ఏర్పాటవుతాయి. దీంతో నంద్యాల అభివృద్ధి పరుగులు పెడుతుంది.  ఒక్క ఏడాది గట్టిగా దువా చెయ్యమని కోరుతున్నా. ఏడాది ఓపిక పడితే.. వచ్చేది మన ప్రభుత్వమే. ఏ పేదవాడూ అప్పు తీసుకుని ఇల్లు్ల కట్టుకోవల్సి న అవసరం లేదు. ఉచితంగా ఇల్లు కట్టి, రిజిస్ట్రేషన్‌ చేసిస్తామని మాటిస్తున్నా. నంద్యాల పేద ప్రజలకు  మూడున్నర సెంట్లలో ఉచితంగా ఇల్లు కట్టిస్తా.







ఆటోనగర్‌ వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయిస్తా. మార్కెట్‌లో ఏ ఒక్కరూ రాయల్టీ కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తా. రోడ్డు విస్తరణ పనుల్లో వ్యాపార సముదాయాలు పోగొట్టుకున్న వారి కి మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లిస్తా.  రైతులకు కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరించడంతోపాటు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తా. అగ్రిగోల్డ్, కేశవరెడ్డి ఆస్తుల వెనుక చంద్రబాబు బినామీలే ఉన్నారు.  ఆ బాధితులకు హామీ ఇస్తున్నా.. మన ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే వారికి ఇవ్వాల్సింది పూర్తిగా చెల్లిస్తాం.



అడ్డుపడితే.. అవసరమైతే చంద్రబాబు చొక్కా విప్పిస్తాం. ఆదినారాయణరెడ్డి నిక్కర్‌ కూడా విప్పిస్తాం.  వెళ్లే ముందు ఒక్క విషయం చెప్పాలి.. పార్టీ గుర్తు గుర్తుంచుకోండి. ప్రజల్ని అయోమయానికి గురిచేయడానికి ఎస్‌.మోహన్‌రెడ్డి అనే పేరుతో 10 మందితో నామినేషన్‌ వేయించారు. అందుకే గుర్తు గురించి మళ్లీ చెబుతున్నా.. ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయండి ’’ అంటూ  జగన్‌  ప్రచారానికి ముగింపు పలికారు.    
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top